జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్లు అయినా ఈ పదేళ్లలో సాధించింది శూన్యమని పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న చిన్నచిన్న తప్పుల వల్ల జనసేనకు ఇప్పటికీ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, వైసీపీ స్థాయికి జనసేన ఎదుగుతుందని పార్టీ పెట్టిన సమయంలో పవన్ అభిమానులు ఆశించగా ఆ ఆశలు అడియాశలయ్యాయి. ప్రధానంగా పవన్ చేస్తున్న పది తప్పులు జనసేనకు మైనస్ అవుతున్నాయి.
 
వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం : సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇతర రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదిగే ప్రయత్నం చేస్తే ఆశాజనకంగా ఫలితాలు ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం గత పదేళ్లలో వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న మంచి పథకాల గురించి  పవన్ ఎప్పుడూ పాజిటివ్ గా కామెంట్లు చేయలేదు.
 
రాజకీయాల కంటే సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వడం : పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత కూడా వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా అయ్యారు. తాను సీరియస్ పొలిటీషియన్ అనే భావనను కలిగించడంలో పవన్ ఫెయిలయ్యారనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యేగా గెలిచినా పిఠాపురం ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటారని చెప్పలేము.
 
గ్రామస్థాయిలో జనసేనకు కార్యకర్తలు లేకపోవడం : ఏ పార్టీ అయినా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల్లో కొనసాగాలంటే ఆ పార్టీకి గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు, నేతలు ఉండాలి. వైసీపీ, టీడీపీలతో పోల్చి చూస్తే గ్రామ, మండల స్థాయిలో జనసేన బలం ఎంతో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 
జనసేన పార్టీకి మేనిఫెస్టో లేకపోవడం : ఏ రాజకీయ  పార్టీ అయినా అధికారంలోకి వస్తే ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కొన్ని హామీలను ప్రకటిస్తుంది. అయితే జనసేన మాత్రం ఏపీ ప్రజల కోసం ఎలాంటి హామీలను ప్రకటించలేదు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినా టీడీపీ సూపర్ సిక్స్ హామీలు మినహా జనసేన నుంచి ఎలాంటి హామీల అమలు అయితే ఉండదని తెలుస్తోంది.
 
పవర్ షేరింగ్ కోసం డిమాండ్ చేయకపోవడం : కూటమి అధికారంలోకి వస్తే రెండున్నరేళ్లు కాకపోయినా కనీసం ఏడాది అయినా పవన్ సీఎంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం పవర్ షేరింగ్ అనే మాట పలకడానికి కూడా ఇష్టపడటం లేదు. పవన్ సీఎం కావాలని భావిస్తున్న తమ కోరిక నెరవేరుతుందో లేదో అని పవన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
 
కేవలం 21 సీట్లలో మాత్రమే పోటీ చేయడం : పవన్ కళ్యాణ్ కొంతకాలం క్రితం కనీసం 58 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. కానీ జనసేన 21 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. ఈ 21 సీట్లలో కూడా జనసేన కోసం కష్టపడిన అభ్యర్థులకు కాకుండా ఇతర పార్టీల నుంచి జనసేనలో చేరిన నేతలకు టికెట్లు దక్కడం గమనార్హం.
 
రాయలసీమలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడం : రాయలసీమలో జనసేన పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇక్కడ ఈ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదు. భవిష్యత్తులో సైతం జనసేన రాయలసీమలో సంచలనాలు సృష్టిస్తుందని ఆశిస్తే మాత్రం అత్యాశే అవుతుందని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
 
పార్టీ కోసం కష్టపడిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకపోవడం : జనసేన టికెట్ల పంపిణీలో జరిగిన గందరగోళం అంతాఇంతా కాదు. పార్టీ కోసం ఐదేళ్లు కష్టపడిన నేతలలో చాలామందికి టికెట్లు దక్కలేదు. టికెట్లు దక్కని నేతలకు పవన్ ఎలాంటి హామీలు ఇవ్వలేదని తెలుస్తోంది. పవన్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని టికెట్లు దక్కని నేతలు ప్రశ్నిస్తున్నారు.
 
జగన్ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగేలా విమర్శలు : కారణాలు తెలీవు కానీ జగన్ విషయంలో మాత్రం పవన్ విమర్శలు కొన్ని సందర్భాల్లో హద్దులు దాటుతున్నాయి. జగన్ వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా పవన్ చేసిన కొన్ని కామెంట్లపై విమర్శలు వ్యక్తమయ్యాయి. పవన్ స్థాయి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం సరికాదని సామాన్యులు సైతం అభిప్రాయపడ్డారు.
 
వాలంటీర్ల విషయంలో రెండు నాల్కల ధోరణి : గతంలో వాలంటీర్లు రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు చేశారనే విధంగా పవన్ చేసిన కామెంట్లు సంచలనం అయ్యాయి. ఇప్పుడు మాత్రం పవన్ వాలంటీర్ల గురించి పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. వాలంటీర్ల విషయంలో పవన్ రెండు నాల్కల ధోరణి వల్ల పార్టీకి నష్టం కలిగిందని పవన్ ఫ్యాన్స్ సైతం నమ్ముతున్నారు.

పవన్ కళ్యాణ్ తనపై వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని కొన్ని విషయాల్లో మారితే గొప్ప లీడర్ గా ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పవన్ కు అభిమానుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అన్ని వర్గాల ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే స్థాయికి పవన్ ఎదిగితే రాజకీయాల్లో సైతం పవన్ కు తిరుగుండదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: