రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి “మేమంతా సిద్ధం”పేరుతో 21 రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టారు. ప్రచారంలో భాగంగా  శనివారం సాయంత్రం ఆయన విజయవాడకు చేరుకున్న విషయం తెలిసిందే. చీకటి పడ్డాక వివేకానంద స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై రాయి విసిరారు. ఈ ఘటనలో జగన్ గాయపడ్డారు. ఆయన ఎడమకంటి పైభాగం, నుదుటిపై గాయమైంది.అక్కడికక్కడే ప్రథమ చికిత్స చేసుకున్న అనంతరం బస్సు యాత్రను యధాతథంగా కొనసాగించారు. రాత్రి విరామం అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.డాక్టర్లు ఆయనకు చికిత్స అందించారు. ఆ సమయంలో జగన్ భార్య వైఎస్ భారతి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు అధికారులు ఉన్నారు. 

డాక్టర్లు ఆ గాయానికి మూడు కుట్లు వేసినట్లు సమాచారం. కొంత విశ్రాంతి అనంతరం జగన్ కేసరపల్లిలో ఏర్పాటు చేసిన తన బస్సు యాత్ర నైట్ క్యాంప్‌ కు బయలుదేరి వెళ్లారు. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ డాక్టర్లు చేసిన సూచనలకు జగన్ సానుకూలంగా స్పందించడంతో నేటి బస్సుయాత్రకు బ్రేక్ ఇచ్చారు.వైఎస్ జగన్‌పై జరిగిన దాడి పట్ల ప్రముఖ నటుడు మోహన్ బాబు మరియు ఆయన తనయుడు  హీరో మంచు విష్ణు స్పందించారు. ఈ దాడి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దాడిని దురదృష్టకర ఘటనగా వారు అభివర్ణించారు. ఇలాంటి హింసతో కూడిన ఘటనలు సమాజానికి అస్సలు మంచివి కావని వ్యాఖ్యానించారు.

ఆ షిర్డీ సాయినాథుడు, శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఈ గాయం నుంచి వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని, నూతన శక్తితో తిరిగి విధులను పునఃప్రారంభించాలని కోరుకుంటోన్నట్లు మోహన్ బాబు మరియు మంచు విష్ణు తెలిపారు..అలాగే జగన్‌పై దాడి పట్ల సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. జగన్ కంటికి గాయమైన ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. అలాగే- నారా లోకేష్ వేసిన ట్వీట్ పట్ల ఆర్జీవీ మండిపడ్డారు.ఇన్నాళ్లూ నారా లోకేష్‌కు బ్రెయిన్ మాత్రమే లేదని నేను అనుకునే వాడినని కానీ ఆయనకు హృదయం కూడా లేదని ఈ ట్వీట్ చూసాకే తెలిసింది.కంటికి ఒక అంగుళం కింద ఇదే రాయి లోకేష్ కి తగిలితే  ఎలా రియాక్ట్ అవుతారు.. ఆ మాత్రం జ్ఞానం లేదా అంటూ ఆర్జీవి ఫైర్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: