తెలంగాణ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ప్రత్యేక స్థానం కలిగిన ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు పరిపూర్ణంగా కొనసాగుతున్నాయి. ఈ పండుగలో భాగంగా బోనాల అనంతర రోజు నిర్వహించే "రంగం" కార్యక్రమం ఈరోజు కాళభైరవ ఆశీస్సులతో వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తుల సమక్షంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చేశారు. ఈ కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత అమ్మవారి వేషధారణ లో, పచ్చి కుండ పై నిలబడి భవిష్యవాణిని వివరంగా చెప్పారు . "ఈ సంవత్సరం వర్షాలు బాగా పడతాయి . భక్తులు నన్ను సంతోషపెట్టారు . కానీ నా మాటలు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక నుంచి నేను కన్నెర్ర చేస్తే , రక్తం కక్కుకుంటారు" అంటూ ఆమె హెచ్చరించారు .


భవిష్యవాణి ముఖ్యాంశాలు :
మహమ్మారి భయం: త్వరలో మహమ్మారి మళ్లీ రాబోతోంది . ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు .

అగ్నిప్రమాదాల హెచ్చరిక: తాను ముందే చెప్పానని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు .

పంటలు: పాడిపంటలు సరిగా పండేందుకు తానే బాధ్యత తీసుకుంటానని తెలిపారు.

ఆరాధన విషయంలో అలక్ష్యం : తాను ప్రతి సంవత్సరం కోరికలు చెబుతుంటే కూడా పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

సక్రమ పూజలు చేయాలని ఆజ్ఞ : విధి విధానాలతో, నిబంధనలతో పూజలు చేయాలని కోరారు.



ఈ సందర్భంగా ఆలయ పూజారులు తల్లికి సమర్పణగా పప్పు, ఫలహారం సమర్పించి, సక్రమ పూజలపై హామీ ఇచ్చారు. భక్తులు ఐదు వారాలు ప్రత్యేక పూజలతో తల్లిని సంతుష్టిపరచాలని సూచించారు. ఘనంగా అమ్మవారికి ఊరేగింపు : రంగం అనంతరం అమ్మవారికి అంబారీ ఊరేగింపు ఘనంగా సాగింది. ఈ ఊరేగింపు కోసం ప్రత్యేకంగా కర్ణాటక తుంకూరు జిల్లాలోని కర్రి బసవ స్వామి మఠం నుంచి 33 ఏళ్ల ఆడ ఏనుగు లక్ష్మిని తీసుకువచ్చారు. అమ్మవారి అంబారీ ఊరేగింపులో భాగంగా సాయంత్రం "పలహారం బండ్ల" ఊరేగింపు కూడా జరగనుంది. ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొని అమ్మవారి దీవెనలు తీసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: