
అయితే, అప్పటి ప్రభుత్వం ఈ సూచనలను పెద్దగా పరిగణనలోకి తీసుకోకపోవడం ప్రజల్లో అసంతృప్తికి దారితీసింది. ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలలో ముఖ్యమైనది జిల్లాల పునర్వ్యవస్థీకరణ. ప్రజల అవసరాలను బట్టి, చారిత్రక నేపథ్యం, భౌగోళిక సమీపత, పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని న్యాయమైన పునర్విభజన చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారం తాజా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో ఏర్పడిన ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, హోంమంత్రి వంగలపూడి అనిత, రోడ్లు, భవనాల మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జలవనరుల మంత్రి రామానాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటికి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న జిల్లాల పేరు, పరిమాణం, సరిహద్దులు, అభివృద్ధి సాధ్యతలు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తుంది. ప్రాంతీయ చారిత్రక ప్రాధాన్యత, ప్రజల సెంటిమెంట్, పరిపాలనా పరమైన ప్రయోజనాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త ప్రతిపాదనలు రూపొందించనుంది. ఇప్పటికే ‘వైఎస్సార్ జిల్లా’ను ‘వైఎస్సార్ కడప’ జిల్లాగా మళ్లీ పునఃనామకరణం చేసిన ప్రభుత్వం, మిగతా జిల్లాలపైనా మార్పులు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే విజయవాడ నగరానికి చెందిన పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో కలిపిన విధానం, కొత్తవలస మండలాన్ని విజయనగరం జిల్లాలో కలపడం వంటి చర్యలు ప్రజల్లో అసంతృప్తిని కలిగించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అనేక కేసులు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి, ప్రజల అభిప్రాయాల ఆధారంగా పారదర్శకంగా, సమర్థవంతంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలని ప్రభుత్వం యోచిస్తోంది. మంత్రుల కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రానికి మరింత సమగ్ర పాలన అందేలా జిల్లాలను మళ్లీ రూపొందించే ప్రక్రియను చేపట్టనుంది. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా చేపడుతున్న ఈ చర్య ప్రభుత్వానికి విశ్వసనీయతను తీసుకురావడంలో కీలకం కానుంది.