
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఇటీవల మంత్రుల ప్రవర్తన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటకు ఎంత విలువ ఉందో, మంత్రుల వాయిస్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా అధికారంలో ఉన్న సమయంలో, ప్రతి మంత్రి మాట్లాడే ప్రతి మాట పార్టీకి, ప్రభుత్వంపై ప్రభావం చూపేలా ఉంటుంది. అయినప్పటికీ, కొంతమంది మంత్రులు ఈ విషయాన్ని విస్మరిస్తూ… అనవసరంగా వివాదస్పద వ్యాఖ్యలతో దుమారానికి కారణమవుతున్నారు. ఇటీవలి మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి నారాయణ చేసిన వ్యాఖ్యలు ఈ అంశంపై తీవ్ర చర్చలకు దారితీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా చెప్పిన అంశాలపైనే, ఈ ఇద్దరు మంత్రులు భిన్నంగా మాట్లాడడం సర్కారుకు సమస్యలను తెచ్చిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఆడబిడ్డ నిధి అంశంపై వివాదం :
గత ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన "సూపర్ సిక్స్" హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు తెలిసిందే. ఈ పథకాన్ని P4 పోర్టల్ ఆధారిత పథకంతో అనుసంధానం చేస్తామని, అధికార గైడ్‌లైన్స్ ప్రకారం మహిళలకు ఆర్థిక సహాయం అందుతుందని ఆయన వివరించారు. కానీ, దీనిపై ఇతర మంత్రులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా హెచ్చరించారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం ఈ విషయాన్ని మరోసారి ప్రస్తావిస్తూ, “ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది,” అని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసాయి. ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాలు రాజకీయంగా బాగా ఉపయోగించుకున్నాయి.
నారాయణ వ్యాఖ్యలు – అభిమానం తప్ప అభద్రతా?
ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అమరావతి నిర్మాణాలపై వ్యాఖ్యల సందర్భంగా ఓ ఇంజనీర్‌ను “స్టుపిడ్”, “యూజ్‌లెస్ ఫెలో”, “గెట్ అవుట్” అంటూ గట్టిగా తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విద్యావంతుడు, అనుభవం గల మంత్రి అయ్యుండి ఇలా స్పందించడం తగదని పలువురు మేధావులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్కారు పనితీరుపై ప్రజల్లో గౌరవం పెరగాల్సిన సమయంలో, ఇలా మంత్రుల చర్యల వల్ల ప్రతికూలతలు వస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు స్పష్టమైన మార్గదర్శకాలను ఇస్తున్నా… కొన్ని సందర్భాల్లో మంత్రుల అవుసరపు వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు