- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

వైఎస్సార్సీపీలో తాజాగా రాజీనామాల అంశం చర్చకు కేంద్రబిందువుగా మారింది. గత వారం పది రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నట్లుగా, వైసీపీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు షాక్ ఇవ్వబోతున్నారని వార్తలు వెల్లడ‌వుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే ముందుగా ఈ రాజీనామాలు జరగవచ్చని, పార్టీకి వ్యతిరేకంగా అసంతృప్తి పెరిగిందని ప్ర‌చారం న‌డుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, వీరిలో నేరుగా జగన్ మోహన్ రెడ్డి మినహా మిగిలిన వారంతా ఒకేసారిగా రాజీనామా చేసే యత్నంలో ఉన్నారని ఓ సెక్ష‌న్ మీడియా గ‌ట్టిగా ప్రచారం చేస్తోంది. అయితే అసలు లోతుగా విశ్లేషిస్తే, వీరిలో అయిదు ఆరుగురు ఎమ్మెల్యేలు జగన్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. వారు బలమైన విధేయత చూపిస్తున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


కొన్ని అసంతృప్తులు ఉన్నా ప్ర‌తిప‌క్ష పార్టీగా సరైన పంథాలో పయనించడంలేదన్న భావన కొంతమందిలో ఉంది. దీనిపై పార్టీ అధినేత జగన్ ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల సమావేశంలో  “మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని వినిపిస్తోంది, ఏంటిది కథ?” అని సరదాగా ప్రశ్నించార‌ట‌. దీంతో సమావేశంలో ఉన్నవారంతా నవ్వడం ద్వారా ఈ ప్రచారం అసత్యమని పరోక్షంగా చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు అయింది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో కొట్టిపారేయటం లేదు. "నిప్పు లేనిదే పొగరాదు" అన్న సామెతను ఉదహరిస్తూ, పార్టీ లోపల ఏదో ఒక రకమైన అసంతృప్తి ఉంద‌ని ... జ‌గ‌న్ కామెంట్స్ కూడా ఆ దిశ‌గానే సంకేతాలు ఇస్తున్నాయ‌ని చెపుతున్నారు. అందుకే తాను "అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎవరిని ఆపలేదు. ఎవరికి వారు స్వేచ్ఛగా వెళ్లవచ్చు" అని వ్యాఖ్యానించడం ద్వారా వెళ్లే వారికి అడ్డుపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.


ఇది చూస్తుంటే, జగన్ ఇప్పటికే వెళ్లే వారిని పట్టుకుని నిలబెట్టే ప్ర‌య‌త్నం కూడా తాను చేయ‌ను అన్న నిర్ణ‌యంలోనే ఉన్నార‌ని వైసీపీ వ‌ర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. పార్టీకి నిబద్ధంగా ఉండే నాయకులతోనే ముందుకెళ్లాలని, దురాశతో చేరిన వారిని నిలబెట్టుకోవడం అవసరం లేదన్న భావన జ‌గ‌న్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత అసలు మ్యాట‌ర్ ఏంట‌న్న‌ది తేలిపోనుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: