దేశంలో అప్పుల చర్చ ఎప్పుడూ రాజకీయంగా హాట్ టాపిక్‌గానే ఉంటుంది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల అప్పులు ఎక్కువయ్యాయని, బీజేపీ నాయకులు తరచూ విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ అదే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేంద్రంలో పదకొండు సంవత్సరాలుగా పాలన నడిపిస్తూనే దేశాన్ని అప్పుల పాలయ్యేలా చేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ పెద్దలు అభివృద్ధి పేరుతో రోడ్లు, రైళ్లు, విమాన సదుపాయాలు, వైద్య, తాగునీటి ప్రాజెక్టులు పెరిగాయని చెబుతున్నారు. కానీ ఆ అభివృద్ధి వెనుక అప్పుల పెరుగుదలనే ప్రధానంగా చూపిస్తున్నాయి గణాంకాలు. ప్రస్తుతం భారత్ అప్పులు అక్షరాలా 200 లక్షల కోట్లు దాటాయి. ఇది చిన్న సంఖ్య కాదు – జాతీయ స్థూల ఉత్పత్తిలో ఏకంగా 56 శాతం వరకు అప్పులే ఉన్నాయన్నది షాకింగ్ నిజం.


కేంద్రానికి వచ్చే ఆదాయంలో సింహభాగం అప్పుల వడ్డీలకే పోతుంది. తాజాగా సమర్పించిన లెక్కల ప్రకారం మొత్తం ఆదాయంలో 37% పైగా కేవలం అప్పుల వడ్డీలకే కేటాయించబడుతోంది. అంటే ప్రభుత్వం సంపాదిస్తున్న ప్రతి 100 రూపాయల్లో 37 రూపాయలు అప్పు తీర్చేందుకే వినియోగమవుతున్నాయి. 2014లో నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అప్పుల మొత్తం 70.88 లక్షల కోట్లు మాత్రమే. కానీ పది సంవత్సరాల్లో మూడింతలు పెరిగి 200 లక్షల కోట్లు దాటిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మోడీ పాలనలో ఇప్పటివరకు 100 లక్షల కోట్ల రూపాయలు వడ్డీలకే చెల్లించబడిందని లెక్కలు చెబుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం దాదాపు 10 లక్షల కోట్లు అప్పుల వడ్డీలకే ఖర్చవుతున్నాయి.



కేంద్రాన్ని అనుసరించి రాష్ట్రాలు కూడా అప్పుల మోత మోగిస్తున్నాయి. తమిళనాడు 9.55 లక్షల కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, యూపీ 8.57 లక్షల కోట్లు, మహారాష్ట్ర 8.12 లక్షల కోట్లు అప్పులతో టాప్-3లో ఉన్నాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వంపై తీవ్రమైన దాడి చేస్తోంది. "అప్పుల్లో దేశాన్ని ముంచేసింది, ఆర్థిక నియంత్రణ గాడి తప్పింది" అని కాంగ్రెస్ విమర్శిస్తోంది. తమ హయాంలో ఆదాయం – అప్పులను సమన్వయం చేశామని చెబుతూ, బీజేపీ మాత్రం అభివృద్ధి కోసం తీసుకున్న అప్పులని సమర్థించుకుంటోంది. కానీ 200 లక్షల కోట్ల అప్పులు, 100 లక్షల కోట్ల వడ్డీలు – ఈ గణాంకాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: