ఏ రాజకీయ నాయకుడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరొకలా మారిపోవడం సర్వసాధారణం. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదని, ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాదని ఎప్పుడూ ప్రజల పక్షానేఉంటారని అందరూ మాట్లాడుకునేవారు. అయితే రీసెంట్‌గా సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్‌పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ ఓటమి తర్వాత ప్రభుత్వం అధికారం చేపట్టి 14 నెలలు అవుతున్నప్పటికీ, సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకునే టైమ్ కూడా లేకపోయిందని ఆమె ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన కూతురి కేసు గుర్తొచ్చిందని, కానీ అధికారంలోకి రాగానే మరిచిపోయారని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మనందరికీ తెలిసిందే సుగాలి ప్రీతి హత్య కేసు ఎంత సంచలనంగా మారిందో . ఈ కేసులో న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరూ చివరకు తప్పుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తన కూతురి హత్య కేసులో న్యాయం చేస్తారని ప్రీతి తల్లి పార్వతి నమ్మకం పెట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంతో ఆమె తాజాగా తన కోపాన్ని బహిర్గతం చేశారు.అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ మొదటి సంతకం ప్రీతి కేసు ఫైల్‌పై చేస్తామని హామీ ఇచ్చారని, కానీ 14 నెలలైనా ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రెస్ మీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? జనసేన పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోతోంది? అని ఆమె ప్రశ్నించారు.

జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించిన ఆమె .. “ఖైదీ శ్రీకాంత్ పెరోల్ పై ఉన్న శ్రద్ధ నా కూతురు ప్రీతి హత్య కేసులో ఎందుకు లేదు? గిరిజనులు కేవలం ఓట్ల కోసం మాత్రమేనా?” అంటూ మండిపడ్డారు. సుగాలి ప్రీతి హత్యపై డిజిటల్ క్యాంపెయిన్ చేస్తామని చెప్పి పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. ప్రీతి మరణంపై సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. “మాటకొస్తే రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు. అస్సలు రెడ్‌బుక్‌లో నా కూతురి హంతకుల పేర్లు ఉన్నాయా?” అని కూడా నేరుగా ప్రశ్నించారు.

“నా కూతురి హత్యకి కారణం ఎవరు? అసలు ఎలా జరిగింది? నా కూతురికి న్యాయం చేయమని ఎనిమిదేళ్లుగా పోరాడుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పట్టించుకున్నారు, హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు నిలబెట్టుకోలేకపోయారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సుగాలి ప్రీతి హత్య కేసుపై చర్చ జరగాలని, కేసును సిబిఐకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. త్వరలోనే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని కేసు గురించి జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేస్తానని కూడా చెప్పారు.

2017 ఆగస్టు 13న కర్నూలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక హత్య జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. శరీరంపై గాయాలు ఉండటంతో రకరకాల అనుమానాలు ముసురుకున్నాయి. ఇన్నాళ్లు ఓపికగా న్యాయం కోసం వేచి చూసిన ప్రీతి తల్లి పార్వతి, ఇప్పుడు మాత్రం ఆవేదనతో, కడుపుమంటతో బహిరంగంగా మాట్లాడారు. కొందరు ఆమె ఈ వ్యాఖ్యలను రాజకీయరంగంలోకి లాగుతూ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. “నమ్మకద్రోహి నువ్వు… నమ్మించి ముంచేశావ్ పవన్ కళ్యాణ్” అంటూ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: