
సభ ఏర్పాట్లను పెద్దఎత్తున పార్టీ కీలక నేతలు చూసుకున్నారు. పవన్ సభలకు జనాలు తాకిడి హామీ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సమస్య, వచ్చిన జనసంద్రాన్ని ఎలా కంట్రోల్ చేస్తారనేదే! ఇప్పటికే అధికారంలో భాగస్వామిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ ఏమి మాట్లాడతారన్నదే చర్చ. కూటమి పాలనలో 15 నెలల్లో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పడంతో పాటు, జనసేన క్యాడర్‌కు జోష్ ఇచ్చేలా వైసీపీపై మంటలు రగుల్చుతారని అంటున్నారు. అలాగే కూటమి బలం, పొత్తుల భవిష్యత్తుపై కూడా పవన్ క్లారిటీ ఇవ్వొచ్చని సమాచారం. విశాఖలో పవన్ అడుగుపెట్టగానే సుగాలీ ప్రీతి కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ఆమె తల్లి చేపట్టిన వీల్‌చెయిర్ పాదయాత్ర సంచలనం సృష్టించింది.
పవన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై పవన్ బహిరంగ సభలో స్పష్టమైన వివరణ ఇస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు కూడా పవన్ స్పీచ్‌పై దృష్టి సారించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి ఆయన గళం విప్పుతారా? అన్న ఆసక్తి ఉంది. ఇక పెద్ద ప్రశ్న – పవన్ స్పీచ్ ఫుల్ ఫైర్‌బ్రాండ్ మోడ్‌లో ఉంటుందా? లేక ఉప ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టుగా డిప్లొమాటిక్‌గా ఆగిపోతారా? అన్నది. అభిమానులు మాత్రం పవర్‌ఫుల్ స్పీచ్‌కే ఎదురు చూస్తున్నారు. మొత్తానికి విశాఖ సభ, పవన్ కళ్యాణ్ ప్రసంగం – ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని కుదిపేస్తుందనడంలో సందేహం లేదు.