తమిళనాడు రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటన రాష్ట్ర రాజకీయ సమీకరణాలను కుదిపేస్తోంది. ఈ ఘటనలో తనకు ఎలాంటి తప్పిదం లేదని చెప్పుకునేందుకు సినీ హీరో నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ ముందుకొచ్చారు. ఆయన నేరుగా డీఎంకే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, “ఈ మొత్తం వ్యవహారం కుట్రలో భాగమే” అని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వం కావడంతో విచారణలో నింద తనపైనే మోపుతారని ముందే నిర్ణయానికి వచ్చిన విజయ్, కేసును స్వతంత్ర దర్యాప్తు లేదా సీబీఐ విచారణకు అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.


ఇక ఈ రాజకీయ పరిణామాన్ని వాడుకోవడంలో బీజేపీ ముందుకు వచ్చింది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై, విజయ్‌కు బహిరంగ మద్దతు ప్రకటించారు. తొక్కిసలాటలో విజయ్ తప్పేమీ లేదని, మొత్తం వ్యవహారం ప్రభుత్వమే సృష్టించిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు, నిజాలు బయటకు రావాలంటే కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ మద్దతు విజయ్‌కు తాత్కాలిక ఊరటనిస్తుందేమో కానీ, అదే సమయంలో ఒక రాజకీయ ట్రాప్ వేసినట్టే అని విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్ ఇప్పటివరకు ఎవరితోనూ పొత్తులు పెట్టుకోనని స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా బీజేపీతో అయితే సిద్ధాంత పరంగా దూరం ఉన్నందున కలిసే అవకాశం లేదని పలుసార్లు కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.


డీఎంకేతో కూటమి అసాధ్యం. కాంగ్రెస్‌తో పొత్తు కూడా డీఎంకే కారణంగా సాధ్యం కాని పరిస్థితి. ఈ క్రమంలో విజయ్ ఒంటరి దారిలో నడవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ బీజేపీ మాత్రం వేరే లెక్కలు వేసుకుంటోంది. అన్నాడీఎంకేను తనవైపు లాగుకుని, విజయ్ పార్టీని కూడా ఎన్డీఏలో భాగం చేయాలని ప్రయత్నిస్తోంది. అలా అయితే తమిళనాడులో డీఎంకేకు గట్టి చెక్ వేయొచ్చని బీజేపీ ఆలోచిస్తోంది. కరూర్ ఘటన తర్వాత విజయ్ పార్టీ సీబీఐ దర్యాప్తు కోరడం, బీజేపీ అదే డిమాండ్‌ను రిపీట్ చేయడం ఈ రెండు అంశాలు రాజకీయంగా ఒకే దిశగా నడుస్తున్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇది విజయ్‌కి ఇబ్బందికరమే. బీజేపీ మద్దతును ఆయన స్పష్టంగా తిరస్కరించలేరు, అంగీకరిస్తే మాత్రం విజ‌య్ కు ప‌ర్స‌న‌ల్ ఐడెంటీటీ ఉండ‌దు. ఇదే విజయ్‌కు అసలైన రాజకీయ పరీక్ష.


ప్రస్తుతం ఆయన ఒక వైపు డీఎంకే ప్రభుత్వ ఒత్తిడి, మరో వైపు బీజేపీ వ్యూహాత్మక మద్దతు మధ్య ఇరుక్కుపోయారు. కరూర్ ఘటన సమయంలో విజయ్ తొలగిపోవడం ఆయన నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పుడు ఈ సంక్షోభాన్ని అధిగమించి తన పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టగలిగితేనే, ఆయన తమిళనాడు రాజకీయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదిస్తారు. లేనిపక్షంలో, ఈ ఘటన ఆయనకు మరింత కష్టాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: