ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి ప‌దిహేడు నెల‌లు గ‌డుస్తున్నా, ప్ర‌భుత్వ యంత్రాంగంపై వైసీపీ నీడ‌లు ఇంకా తొల‌గిపోలేద‌ని, ముఖ్యంగా రేష‌న్ బియ్యం అక్రమ రవాణాలో వైసీపీ నియమించిన వారే చక్రం తిప్పుతున్నార‌ని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూట‌మిలో మంట‌లు రేపుతున్నాయి. ప్ర‌భుత్వ ప‌నితీరుపైనే ఈ ఆరోప‌ణ‌లు తీవ్ర ప్ర‌శ్న‌లు సంధిస్తున్నాయి. రేషన్ బియ్యం మాఫియా వెనుక 'ఫ్యాన్' నేత‌లు! .. కొలికపూడి శ్రీనివాసరావు కేవ‌లం త‌న నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధికి ప‌రిమితం కాకుండా, ఏకంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న మాఫియా డొంక‌ను క‌దిలించారు. ఆయ‌న ఆరోప‌ణ‌ల సారాంశం ఇదీ:


ద్వారంపూడి లింక్: తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి త‌న‌కు చెందిన మనుషులను రాష్ట్రంలోని ప్ర‌తి జిల్లాలో నియమించుకున్నారని, వారే ఇప్పటికీ రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని కొలిక‌పూడి ఆరోపించారు. (గ‌తంలో కూడా ద్వారంపూడిపై ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి) కేశినేని కార్యాలయంలో మాజీ 'కోడాలి మనిషి': కృష్ణా జిల్లాలో ఈ రేష‌న్ మాఫియాను నడుపుతున్న వ్య‌క్తి, గత ప్రభుత్వ హయాంలో కొడాలి నాని వ‌ద్ద ప‌నిచేసిన వ్య‌క్తేన‌ని, అత‌నే ఇప్పుడు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో కూర్చుని ఈ మాఫియాను న‌డుపుతున్నాడ‌ని కొలిక‌పూడి చేసిన ఆరోపణ మ‌రింత తీవ్ర‌మైంది.



టీడీపీ అభిమానుల ఆగ్ర‌హం: పాల‌న‌లో తేడా ఏముంది? .. కొలికపూడి చేసిన ఈ వ్యాఖ్యలను టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లే జీర్ణించుకోలేక‌పోతున్నారు. పదిహేడు నెల‌ల పాల‌న గ‌డిచినా, ఇంకా వైసీపీ నేత‌ల మనుషులే మాఫియాను నడపడం సిగ్గుచేట‌ని వారు ప‌బ్లిక్‌గా కామెంట్స్ పెడుతున్నారు. "వైసీపీ నేతలను అరెస్ట్ చేయాల్సింది పోయి, వారిని అక్కున చేర్చుకోవడమేంటని?" వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. "ఇలా అయితే వైసీపీ పాలన‌కు, కూటమి పాలనకు తేడా ఏముంద‌న్న" ప్రశ్నలు విప‌రీతంగా వినిపిస్తున్నాయి. ఇది కూట‌మి ప్ర‌భుత్వ ప‌నితీరుపై పెరుగుతున్న అసంతృప్తికి నిద‌ర్శ‌నం.



పౌర‌స‌ర‌ఫ‌రాల మంత్రి నాదెండ్లకు సెగ! .. ఈ ఆరోప‌ణ‌లు ప్ర‌త్యేకంగా పౌరసరఫరాల శాఖ మంత్రిత్వ శాఖ‌ను పర్యవేక్షిస్తున్న జనసేన సీనియ‌ర్ నేత నాదెండ్ల మనోహర్‌కు చుట్టుకున్నాయి. రేష‌న్ మాఫియాపై ఆయ‌న ఇదివ‌ర‌కే దృష్టిసారించి కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, కూట‌మి ఎమ్మెల్యేనే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌డం మంత్రి ప‌నితీరుపై ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు మ‌ర‌క‌ అంటించగా, ఇప్పుడు కొలిక‌పూడి వ్యాఖ్య‌ల‌తో నాదెండ్ల మ‌రింత కోపానికి గురైన‌ట్టు తెలుస్తోంది. మొత్తం మీద, చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌లో మార్పు వ‌స్తుంద‌ని భావిస్తున్న త‌రుణంలో, కూట‌మి నేత‌లే వైసీపీ హ‌వా ఇంకా న‌డుస్తోంద‌ని చెప్ప‌డం.. ముఖ్య‌మంత్రి దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను నొక్కి చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: