- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఈ ఉపఎన్నికను పార్టీ భవిష్యత్తుతో ముడిపెట్టి, చిన్నగా తీసుకునే ఆలోచనలో రేవంత్ లేడు. సాధారణంగా ముఖ్యమంత్రులు ఉపఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం అరుదు. కానీ రేవంత్ మాత్రం వేరే రీతిలో ఆలోచిస్తున్నారు. “జూబ్లీహిల్స్” సిటీ మధ్యలో ఉన్నా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. ఈ సీటు కాంగ్రెస్‌కు తిరిగి తెచ్చుకోవడమే తన లక్ష్యంగా చేసుకున్నారు. అందుకే స్థానికంగా బలమైన నవీన్ యాదవ్‌కు టికెట్ ఇవ్వడం నుంచి ప్రచార వ్యూహాల దాకా అన్నింటిని రేవంత్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రేవంత్ రెడ్డి అక్టోబర్ 30, 31, నవంబర్ 4, 5 తేదీల్లో ప్రధాన రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్‌లు, బైక్ ర్యాలీలను నిర్వహించనున్నారు. చివరి రెండు రోజులు కూడా పూర్తిగా జూబ్లీహిల్స్‌లోనే ఉండి ప్రచారం చేయాలని ఆయన నిర్ణయించారు. అక్టోబర్ 28న యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో తెలుగు సినిమా యూనియన్లతో కూడా సమావేశం పెట్టి, సినీ వర్గాల మద్దతు తీసుకోవాలనుకుంటున్నారు.


గత కొన్ని దశాబ్దాలుగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీకి విజయం దక్కలేదు. పీజేఆర్ తర్వాత ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ఒకసారి గెలిచినా, ఆ తర్వాత నుంచి పార్టీ అక్కడ పాదం మోపలేకపోయింది. చివ‌రిసారిగా 2009లో మాత్ర‌మే అక్క‌డ కాంగ్రెస్ విజ‌యం సాధించింది. ఈసారి మాత్రం పరిస్థితి మారుతుందని రేవంత్ నమ్మకంగా ఉన్నారు. ప్రత్యర్థి బీఆర్ఎస్ మాత్రం ఈ ఉపఎన్నికను పెద్దగా పట్టించుకోవడం లేదు. కేటీఆర్, హరీష్ రావు మాత్రమే ప్రచారంలో చురుకుగా ఉన్నారు. కేసీఆర్ మాత్రం ఈసారి ప్రత్యక్ష ప్రచారానికి దూరంగా ఉండడం గమనార్హం. ఆయన తెర వెనుక వ్యూహాలు రచిస్తున్నా.. ప్రజల ముందుకు రాకపోవడం పార్టీ కార్యకర్తల్లో కొంత నిరుత్సాహం కలిగిస్తోంది.


రేవంత్ మరోవైపు పార్టీ యంత్రాంగాన్ని క్రమబద్ధంగా సిద్ధం చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్‌కు ఇన్‌చార్జ్‌లను నియమించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్‌లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కోవర్ట్‌గా కాంగ్రెస్ ఓటమి కోసం కొంతమంది పనిచేస్తున్నారన్న అనుమానం కూడా ఆయనలో ఉంది. అందుకే ఈసారి ఎలాంటి లోపం లేకుండా తన సొంత పర్యవేక్షణలోనే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైనది. ఈ ఎన్నికలో విజయం సాధిస్తే ఆయన నాయకత్వానికి పెద్ద బూస్ట్ లభిస్తుంది. అందుకే పార్టీ ప్రతిష్టను పణంగా పెట్టి అయినా గెలవాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ స్వయంగా రణరంగంలోకి దిగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: