ఓటమి తరువాత జగన్ ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు. వారానికి ఒకసారి లేదా రెండు సార్లు తాడేపల్లికి వచ్చి మళ్లీ బెంగళూరుకు వెళ్ళిపోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఆయన ఎక్కడ ఉన్నారనే విషయమే కాదు, పార్టీ క్యాడర్ మానసిక స్థితికి కూడా సంబంధించిన అంశంగా మారింది. తమ అధినేత రాష్ట్రంలో లేరన్న భావన వల్ల కేడర్‌లో ఉత్సాహం తగ్గుతోందని, చురుకుదనం లోపిస్తున్నదని పార్టీ అంతర్గతంగా చర్చ సాగుతోంది.
గతంలో వైసీపీ నేతలే కూటమి ప్రభుత్వ నాయకులు హైదరాబాదులో ఉంటారని విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు జగన్ కూడా బెంగళూరులో ఉంటున్నారని అదే పోలిక తెచ్చుకుంటున్నారు. “అధినేత తాడేపల్లిలో ఉంటే అన్నీ చూస్తున్నారు, వింటున్నారు” అన్న నమ్మకం క్యాడర్‌లో ఏర్పడుతుంది. ఆ నమ్మకం వారికి ధైర్యం, ఉత్సాహం తెస్తుంది. పైగా “నేను ఉన్నాను... నేను వింటున్నాను” అన్న జగన్ డైలాగ్ కూడా ఆ సందర్భంలో సార్ధకం అవుతుంది. ప్రజల కోణంలో కూడా ఇదే వాదన వినిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలోనే ఉంటూ ప్రజల మధ్య ఉంటే, వారు తమ సమస్యలు చెప్పుకోవచ్చనే నమ్మకం కలుగుతుంది. ప్రజలతో నేరుగా మమేకం అవ్వడం వల్ల పార్టీకి పాజిటివ్ ఇమేజ్ వస్తుంది. మరోవైపు అధికార పక్షం చేసే విమర్శలకు తగిన సమాధానం ఇవ్వడానికి కూడా జగన్ నిరంతరం ఏపీలో ఉండడం అవసరమని అంటున్నారు.
తాడేపల్లిలో ఉంటూ జగన్ పార్టీ నాయకులను, కార్యకర్తలను తరచూ కలుస్తూ గ్రౌండ్ లెవెల్ పరిస్థితులను తెలుసుకుంటే, వైసీపీ గ్రాఫ్ క్రమంగా పెరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అదనంగా, ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలతో అనుబంధాన్ని బలోపేతం చేయవచ్చు. ఆ తర్వాత ఉద్యమాలు, రోడ్ షోలు మొదలైన వాటికి వెళ్లినా ఫలితాలు మరింత బాగుంటాయని భావిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే, వైసీపీ పునరుత్థానం కావాలంటే జగన్ బెంగళూరు కాకుండా తాడేపల్లిలోనే ఉండి పార్టీని చురుకుగా నడిపించాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి