ఆంధ్రప్రదేశ్‌లో రైతుల పరిస్థితి దారుణంగా మారింది. మొంథా తుపాను రాకతో రాష్ట్రం మొత్తాన్ని వర్షాలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా 25 జిల్లాల్లో రైతులు తీవ్రమైన నష్టాన్ని చవిచూశారు. లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగిపోవడంతో వేలాది కుటుంబాలు ఆర్థికంగా కుప్పకూలిపోయాయి. వరి, పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, మిరప, అరటి, బొప్పాయి, కంద పంటలు – అన్నీ బీభత్సం పాలయ్యాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం వ్యవసాయ రంగానికే సుమారు రూ. 829 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. కానీ నేల మీద పరిస్థితి చూసిన ఎవరైనా “ఈ లెక్కల కంటే కనీసం మూడు రెట్లు ఎక్కువ నష్టం జరిగిందన్న” మాట చెప్పక మానరు. ఎందుకంటే రైతు ఒక్క ఎకరానికి వేలల్లో పెట్టుబడి పెట్టాడు, కానీ తిరిగి దక్కింది శూన్యం. పెట్టుబడి, కూలీ, రుణం, వడ్డీ – అన్నీ ఒకే తాటిపై కూలిపోయాయి.


ప్రభుత్వ భరోసా మాటల్లోనే మిగిలిందా? .. తుపాను తాకిడి తర్వాత సాధారణంగా ప్రభుత్వం చేసే పని – నష్టం అంచనా, ప్రెస్ మీట్, పరిహారం హామీ. కానీ అన్నదాతకు అవసరం హామీ కాదు – నమ్మకం. ఈరోజు వారు పంట కోల్పోయినా రేపు తిరిగి సాగు చేయాలనే ధైర్యం కలగాలి. అందుకోసం కేవలం ఒకసారి ఇచ్చే పరిహారం కాకుండా పంట బీమా పకడ్బందీగా అమలు కావాలి. రైతు జీవనోపాధి కేవలం ఒక సీజన్‌ది కాదు; అది అతని బతుకు గమ్యం. కేంద్రం కొంత సాయం చేస్తుంది, కానీ రాష్ట్రం తగిన విధంగా స్పందించకపోతే ఆ సాయం కూడా అర్థం లేని పద్ధతిగా మారిపోతుంది. “మేము ప్రాణాలు రక్షించాం” అని ప్రభుత్వం చెప్పుకోవడం సరిపోదు. పంటలు పోయిన రైతులకు తిరిగి సాగు చేసే భరోసా ఇవ్వాలి. లేకపోతే బతికే ఉన్నా రైతులు జీవచ్ఛవాల్లా మారిపోతారు.



అన్నదాత అంటే దేశ బలం .. రైతు బతకకపోతే రాష్ట్రం బతకదు. అకాల వర్షాలు, తుపానులు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. కానీ ప్రతిసారి ప్రభుత్వం తాత్కాలిక చర్యలకే పరిమితమైతే వ్యవసాయం దండగ అనే భావన రైతుల మనసులో పెరుగుతుంది. అది కేవలం వ్యవసాయ రంగానికే కాదు – మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకే ప్రమాదకరం. ప్రస్తుతం రైతులు అడుగుతున్నది ఒక్కటే – “మాకు నిజమైన పరిహారం ఇవ్వండి, మా పంటల బీమా సక్రమంగా అమలు చేయండి.” కానీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఏ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. మొత్తానికి, మొంథా తుపాను ముంచేసింది పంటలను మాత్రమే కాదు, రైతుల ఆశలను కూడా. ఇప్పుడు ప్రభుత్వం తక్షణం స్పందించి, ప్రతీ రైతు ఇంటికి భరోసా అందేలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: