రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో జనసేన పార్టీ ప్రభావాన్ని మరింత పెంచే దిశగా పార్టీ అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సమీపిస్తుండగా, జనసేన పార్టీకి చెందిన ఎంపీలకు ప్రత్యేకమైన భారీ టాస్క్ అప్పగించినట్లు సమాచారం. సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, ఇప్పటి నుంచే పవన్ కళ్యాణ్ వ్యూహరచనలోకి దిగారు. జ‌న‌సేన‌కు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. ప‌వ‌న్ ఈ ఇద్ద‌రు ఎంపీల‌ను ప్రత్యేకంగా సమావేశానికి పిలిచి, సమగ్ర వ్యూహం వివరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి - జనసేన - బీజేపీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుండగా, కేంద్రంలో కూడా ఢిల్లీ పాలనలో అదే కూటమి భాగస్వామ్యంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రయోజనం - కూటమి సమన్వయం అనే రెండు లక్ష్యాలతో ముందుకు వెళ్లాలన్నది పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంగా తెలుస్తోంది.


పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడేటప్పుడు, చర్చల్లో పాల్గొనేటప్పుడు, బిల్లులపై ఓటింగ్‌లో పాల్గొనేటప్పుడు కూటమి బంధాన్ని కాపాడటం అత్యంత ముఖ్యం అని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆంధ్రప్రదేశ్‌కు తగిన నిధులు రప్పించాలనే లక్ష్యాన్ని మరింత దృఢంగా కొనసాగించాలి అని ఎంపీలకు సూచించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ శాఖకు సంబంధించిన అనేక ప్రాజెక్టులు, గ్రామీణ అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల పురోగతికి కేంద్రం నుంచి వచ్చే నిధులపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంఘం కేటాయించే నిధులు నేరుగా పంచాయతీల ఖాతాల్లోకి వెళ్లే విధానం నేపథ్యంలో, కేంద్రం సహకారం ముఖ్యం అన్న విష‌యాన్ని ఉప ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ గుర్తు చేసినట్లు తెలుస్తోంది.


తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌కు గ్రామీణాభివృద్ధి ఖర్చులో గణనీయమైన లోటు ఉందని పవన్ ఎంపీలకు వివరించినట్లు టాక్. అందువల్ల శీతాకాల సమావేశాల్లో గ్రామీణ రోడ్లు - శుద్ధి నీటి సరఫరా
-  వైద్యం,  విద్య, పారిశుధ్య మౌలిక వసతులు - మహిళ స్వయం సహాయక సంఘాల బలోపేతం - డిజిటల్ గ్రామాల అభివృద్ధి వీటిని కేంద్రం అజెండాలోకి తీసుకురావటం కోసం అధికారిక లాబీయింగ్, సభలో చర్చ, సంబంధిత మంత్రులతో సమావేశాలు తప్పనిసరిగా చేయాలని పవన్ స్పష్టం చేసినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: