ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు తొలిసారిగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. ఐపీఎల్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఉండే ఆటగాళ్ల లిస్ట్ లో అర్జున్ టెండూల్కర్ పేరు కూడా ఉంది. ఐపీఎల్ 14 వేలం కోసం దాదాపు 1100 మంది ఆటగాళ్లతో బీసీసీఐ ఓ జాబితా రెడీ చేసింది. అందులో అర్జున్ కూడా ఉన్నాడు. ఫిబ్రవరి 18న ఈ సీజన్‌ వేలం జరగనుంది.

ఐపీఎల్ అంటేనే ఇండియాలో ఓ భారీ సైజు క్రికెట్ పండుగ. సామాన్య క్రికెట్ అభిమాని నుంచి సెలెక్షన్ బోర్డు వరకు అందరూ ఈ టోర్నీపై చాలా ఆసక్తిగా ఉంటారు. ఇక ఇప్పుడు ఆటగాళ్లు కూడా ఈ టోర్నీని ఇండియా జట్టులోకి రావడానికి తొలిమెట్టుగా భావిస్తున్నారు. టోర్నీలో ఏమాత్రం సత్తా చాటినా జాతీయ జట్టులో స్థానం లభిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఇలాంటి సందర్భంలో సచిన్ తనయుడు తొలిసారిగా ఐపీఎల్ బరిలో నిలవనుండడం విశేషంగా మారింది.

ఈ వేలం కోసం ఆటగాళ్ల బేస్ ధరలను కూడా బీసీసీఐ ప్రకటించింది. ఈ ధరల ప్రకారం అర్జున్‌ టెండూల్కర్‌ బేస్‌ ధర రూ.20లక్షలుగా ఉండనుందట. మరి తొలిసారిగా ఐపీఎల్ బరిలోకి దిగనున్న అర్జున్ ఏ స్థాయిలో సత్తా చాటుతాడో చూడాలి.

ఇదిలా ఉంటే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 7ఏళ్లకు పైగా నిషేధం ఎదుర్కొన్న కేరళ స్పీడ్ గన్ శ్రీశాంత్‌ కూడా ఈ ఏడాది ఐపీఎల్ బరిలో ఉన్నాడు. మళ్లీ సత్తా చాటి జాతీయ జట్టులోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నాడు. బీసీసీఐ బేస్ ధరల పట్టిక ప్రకారం శ్రీశాంత్‌ కనీస ధర రూ.75 లక్షలతో ప్రారంభం కానుంది.

శ్రీశాంత్ తో పాటు బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ కూడా వేలంలో ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక మొత్తం వేలంలో 1097 మంది ఆటగాళ్లుండగా.. వారిలో 814మంది భారత క్రికెటర్లతో పాటు 283మంది విదేశీయులున్నారు. వెస్టిండీస్‌ నుంచి(56), ఆస్ట్రేలియా(42), దక్షిణాఫ్రికా(38) అత్యధికంగా ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. దరఖాస్తులకు గురువారం(ఫిబ్రవరి 4) ఆఖరు తేదీ.

మరింత సమాచారం తెలుసుకోండి: