ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ ఇంగ్లండ్‌తో ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ పంత్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు పంత్‌ పేరు విపరీతంగా వినిపిస్తోంది. దీంతో వన్డే, టీ20 జట్లలోకి కూడా పంత్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పంత్‌కు చోటు లభించలేదు. అయితే, నంబర్ 7లో ఆల్‌రౌండర్ అవసరం కావడంతో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన పంత్‌కు ఆ తర్వాతి టెస్టుల్లో అవకాశం లభించింది.

చివరి రెండు టెస్టుల్లోను అద్భుతంగా ఆడిన పంత్ భారత్ టెస్టు సిరీస్ గెలుచుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టుల్లోనూ అటు కీపింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. రెండు టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలు చేశాడు.  సూపర్ కీపింగ్‌తో అదరగొడుతున్నాడు. దీంతో వైట్ బాల్ క్రికెట్‌లో కూడా పంత్‌కు మళ్లీ చోటు దక్కే అవకాశాలు కనపడుతున్నాయి.

టీమిండియా వన్డే జట్టులో ఇంతకుముందు కూడా పంత్‌కు అనేక సార్లు ఛాన్స్ వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో 2017 నుంచి మేనేజ్‌మెంట్ మూడుసార్లు అతడిని జట్టు నుంచి తొలగించింది. ఇక ఇప్పుడు మళ్లీ పంత్ రాణిస్తుండడంతో పరిమిత ఓవర్ల జట్టులోకి తిరిగి తీసుకోవాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం సంజు శాంసన్‌పై వేటు వేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఇక, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు ఇంగ్లండ్‌తో జరగనన్న టీ20 సిరీస్‌ కోసం పిలుపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును ఎంపిక చేసిన సమయంలో యాదవ్ పేరు వినిపించినప్పటికీ తుది జట్టులో ఎంపిక చేయలేదు. దీనిపై అప్పట్లో కొంత వ్యతిరేకత కూడా వచ్చింది.

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 12 నుంచి 20 మధ్య జరగనుంది. అనంతరం పూణెలో మార్చి 23 నుంచి 28 మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరుగనుంది. ఇక టెస్టు సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులు కూడా అహ్మదాబాద్‌లోనే జరగనున్నాయి. మూడో టెస్టు ఈ నెల 24 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: