ఇండియా టీమ్ లోకి వచ్చిన అతి తక్కువ కాలం లోనే కీలక ఆటగాడిగా మారిన అతి తక్కువ మంది ఆటగాళ్ళలో సూర్య కుమార్ యాదవ్ ఒకరు అని చెప్పవచ్చు. తన బ్యాటింగ్ శైలి సూర్య ని ప్రత్యేకమైన వాడిగా ప్రేక్షకుల దృష్టిలో నిలిపింది. ఫార్మాట్ ఏదైనా, టోర్నీ ఏదైనా, జట్టు ఏదైనా, బౌలర్ ఎవరైనా.. దూకుడే తన మంత్రంగా ముందుకు దూసుకు పోతున్నాడు. గత మూడు సీరీస్ లుగా సూర్య ఆటలో ఎంతో మెరుగుపడ్డాడు. ఆసియా కప్ నుండి ప్రస్తుతం జరుగుతున్న సౌత్ ఆఫ్రికా సీరీస్ వరకు అన్నింటిలోనూ చెలరేగి ఆడుతూ జట్టుకు విజయాలను అందిస్తున్నాడు.

నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా రెండవ టీ 20 లోనూ దూకుడుగా ఆడి మరో సీరీస్ విజయాన్ని ఇండియాకి అందించాడు. నిన్న టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఓపెనర్లు రోహిత్ మరియు  రాహుల్ లు మొదటి వికెట్ కు 97 పరుగులు జోడించారు. రాహుల్ అర్థ సెంచరీ సాధించగా, రోహిత్ మాత్రం ఉన్నంతసేపు జోరుగా ఆడి  ఔట్ అయ్యాడు. ఈ దశలో కోహ్లీ తో జత కలిసిన సూర్య సౌత్ ఆఫ్రికా బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. మొదటి బంతి నుండే బాదుడు మొదలు పెట్టాడు. తనకున్న అనుభవంతో సౌత్ ఆఫ్రికా బౌలర్లను చీల్చి చెండాడాడు. బౌలింగ్ లో అపారమైన అనుభవ ఉన్న రబడ , అన్రిచ్ , కేశవ్ మహారాజ్ మరియు ఎంగిడి లాంటి బౌలర్ లను ఉతికి ఆరేశాడు.

గ్రౌండ్ కు నలువైపులా షాట్ లు ఆడుతూ ప్రేక్షకులకు అసలైన టీ 20 వినోదాన్ని పంచాడు. సూర్య ఆటతో కోహ్లీ కూడా మైమరచిపోయాడు .. ఇదే ఆటతీరును ప్రపంచ కప్ లోనూ ప్రదర్శిస్తే మరో టీ 20 వరల్డ్ కప్ మన సొంతం అయినట్లే. ఇప్పటికే ఇండియా సౌత్ ఆఫ్రికాను 2 - 0 సిరీస్ తో కైవశం చేసుకుంది. ఇక నామమాత్రమైన చివరి మ్యాచ్ రేపు జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: