
సచిన్ వారసుడు కావడంతో అతనిపై అందరిలో ఎన్నో అంచనాలు పెరిగిపోయాయ్. ప్రపంచ క్రికెట్లో మరో అత్యుత్తమ క్రికెటర్ అవుతాడని అందరూ భావించారు. కానీ అర్జున్ టెండూల్కర్ మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఈ క్రమంలోనే అటు ముంబై ఇండియన్స్ తరఫున అవకాశం దక్కించుకున్నప్పటికీ అర్జున్ టెండూల్కర్ ఒక్కసారి కూడా తుది జట్టులో ఛాన్స్ దక్కించుకోలేదు. ఇకపోతే ఇటీవలే మాత్రం అర్జున్ టెండూల్కర్ తన ప్రదర్శనతో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎడమ చేతి బౌలర్ ఇటీవల హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో కెరియర్ లోనే ఉత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
ఏకంగా నాలుగు ఓవర్లు వేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు అర్జున్ టెండూల్కర్. ఇక మొదటి ఓవర్ లో ఒకే ఒక పరుగు ఇచ్చిన అర్జున్ టెండూల్కర్ మూడో ఒవర్ ను మేయిడిన్ గా మలిచాడు. అతని బౌలింగ్ లో ఎక్కువగా డాట్ బాల్స్ ఉండడం గమనార్హం. అయితే అర్జున్ టెండూల్కర్ రాణించినప్పటికీ మిగతా బౌలర్లు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది హైదరాబాద్ జట్టు. లక్ష్య చేదనకు దిగిన గోవా జట్టు 140 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో 37 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించింది. అయితే అటు గోవా జట్టు ఓడిపోయినప్పటికీ అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన మాత్రం ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.