సాంప్రదాయ నియమ, నిష్టలుగల కుటుంబమవడంచేత కొంత వ్యతిరేకత ఎదురయ్యింది. ఊగిసలాట అనంతరం సూర్యకుమారి సినిమాల్లోకి వచ్చి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ నాలుగు భాషల్లోనూ మొత్తం ఇరవై ఆరు సినిమాల్లో నటించింది. లలిత గీతాలు యాభై, దేశభక్తిగీతాలు యాభై మొత్తం నూరు గ్రామఫోను రికార్డులు ఇచ్చింది. అలాగే ఒక యాభై దాకా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో తన గొంతుతో పాడిన పాటల రికార్డులు ఉన్నాయి.నటన కంటే సూర్యకుమారి పాడిన దేశభక్తి గీతాలు, లలితగీతాలు, అష్టపదులు వంటివాటికి ఎక్కువ ప్రజాదరణ లభించడంచేత ఆమె పాట కచ్చేరీలు తరుచూ చేస్తూండేది. ఆంధ్రలోని చాలా ఊళ్ళలో లలిత సంగీత కచ్చేరీలు చేసింది.
పేరు ప్రతిస్టలు, ప్రజాదరణ ఆమెకు తృప్తినివ్వలేదు. ఏదో ప్రత్యేక కృషి చెయ్యాలన్న తపన, మూడు నాలుగేళ్ళపాటు కరతాళ ధ్వనులకు, ప్రశంసలకు దూరంగా ఉండి, చదువుమీద దృష్టి కేంద్రీకరించి, ప్రైవేటుగా కేంబ్రిడ్జి సీనియర్ పరీక్ష వ్రాసి, ప్రథమశ్రేణిలో పాసైంది. సూర్యకుమారి కంఠ, రంగూ, రూపం ఆకర్షణీయంగా ఉన్నా, మామూలు అమ్మాయిలకంటే కొంచెం పొడవుగా ఉండటం చేత, సినిమా రంగంలో సమస్య అయ్యింది. ఆనాటి సగటు హీరోలు ఈమె కంటే ఓ చూపువాసి పొట్టిగా ఉండటంచేత కాస్త ఇబ్బంది. అదీ కాక ఈమె బ్రాహ్మణ కుటుంబం, అందులోనూ పేరుపొందిన రాజకీయ కుటుంబం నుంచి రావటమే కాదు, ప్రేమ సన్నివేశాలు హీరోయిన్ మీద హీరో చెయ్యి వెయ్యడం, ఇత్యాదివి ఒప్పుకొనేవారు కాదుట. అందువల్ల గొప్ప చాతుర్యం ఉండి కూడా సూర్యకుమారి సినిమాల్లో సుస్థిరత పొందలేక పోయింది.
తెలుగు, తమిళము, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో నటించిన సూర్యకుమారి మంచి గాయకురాలు కూడా. స్వాతంత్ర్యోద్యమ సమయములో మా తెనుగు తల్లికి మల్లెపూదండ, దేశమును ప్రేమించుమన్నా మొదలైన అనేక దేశభక్తి గీతాలు పాడింది. ప్రకాశం పంతులు ఈమె కళాభిరుచిని బాగా ప్రోత్సహించాడు. శాస్త్రీయ సంగీతం నేర్పించాడు. అతను ఏ సభకు వెళ్ళినా ఈమెను ఆ సభకు తీసుకెళ్ళి జాతీయ గీతాలు పాడించేవాడు. 1953 అక్టోబరు 1న ఆంధ్ర రాష్టావతరణ సభలో నెహ్రూ, రాజాజీ, ప్రకాశం ప్రభృతుల సమక్షంలో వందేమాతరం, 'మా తెలుగు తల్లికి మల్లె పూదండ' పాటలు ఆలపించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది. వీటితో పాటు'స్వప్నజగతిలో ఛాయావీణ' మొదలైన లలిత గీతాలు, అడవి బాపిరాజు గారి 'ప్రభువుగారికీ దణ్ణం పెట్టూ', 'రావోయి చిన్నవాడా' మొదలైన జానపద గీతాలు కూడా పాడుతుండేది. హెచ్.ఎం.వి. తదితర గ్రామఫోన్ కంపెనీలు ఈమె పాటలను రికార్డు చేశాయి. ప్రముఖ గాయనిగా పేరుతెచ్చుకుంది.
1975లో హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ ఈమె సేవలను గుర్తించి సత్కరించింది. 1979లో రాజ్యలక్ష్మి అవార్డుతో ఈమెను గౌరవించింది. లండను లోని ప్రముఖ చిత్రకారుడు హెరాల్డ్ ఎల్విన్తో వివాహమైంది. 1973లో లండనులో స్థిరపడిన ఈమె ఏప్రిల్ 25, 2005 న లండనులో మరణించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి