వైభవ్ సూర్యవంశీ.. ఈ పేరు ఇప్పుడు ఐపీఎల్‌లో హాట్ టాపిక్. మెరుగైన బ్యాటింగ్ టెక్నిక్, గ్రౌండ్ చుట్టూ భారీ షాట్లతో ఇప్పటికే అభిమానులను ఆకట్టుకున్న ఈ యువ బ్యాటర్, ఐపీఎల్ 2025లో మరో సంచలనం సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుతమైన అర్ధ శతకంతో తన ప్రతిభను చాటడమే కాకుండా, ఒక ప్రత్యేక రికార్డును కూడా తన ఖాతాలోకి చేర్చుకున్నాడు.

మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఢీకొట్టింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 33 బంతుల్లో 57 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 172.73 స్ట్రైక్‌రేట్ తో అతడు 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. కాగా, ఐపీఎల్‌లో తొలి 100 బంతుల్లో అత్యధిక స్ట్రైక్‌రేట్ సాధించిన బ్యాటర్‌గా తన పేరును లిఖించుకున్నాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఖాతాలో ఉండగా, ఇప్పుడు అది వైభవ్ సూర్యవంశీ చేతుల్లోకి వచ్చింది. వైభవ్ మొదటి 100 బంతుల్లో సాధించిన స్ట్రైక్ రేట్ 212.38 కాగా, జేక్ ఫ్రేజర్ స్ట్రైక్‌రేట్ 199.48 మాత్రమే. ఈ ఫీట్‌తో వైభవ్ తన సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. సీఎస్కే తరఫున ఆయుష్ మాత్రే 43, డెవాల్డ్ బ్రెవిస్ 42, శివం దూబే 39 పరుగులతో ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలింగ్ విభాగంలో ఆకాశ్ మధ్వల్, యుధ్వీర్ సింగ్ తలో మూడు వికెట్లు తీసి సీఎస్కే స్కోరు పెరగకుండా అడ్డుకున్నారు.

లక్ష్య చేధనలో రాజస్థాన్ రాయల్స్ 17.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ 57 పరుగులతో టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్ సంజు శాంసన్ 41, యశస్వి జైస్వాల్ 36, ధ్రువ్ జురేల్ 31 (నాటౌట్) పరుగులు చేసి తమ జట్టును గెలుపు బాటలో నడిపారు. సీఎస్కే బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలో వికెట్ తీశారు.ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025లో తమ లీగ్ దశ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది. అయితే పాయింట్ల పట్టిక ప్రకారం వారు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయారు. అయినా చివరి మ్యాచ్‌లో గెలుపు సాధించడం, ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఆటగాడు రాణించడం, జట్టు భవిష్యత్తుకు హామీగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: