భారతదేశంలో రాజకీయాలు, సినిమా, క్రికెట్... ఈ మూడు రంగాల్లో రాణించిన వారికే అత్యంత గుర్తింపు. వీటిలో సినిమా, క్రీడా రంగాల నుంచి రాజకీయాలకు మళ్లిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. తాజాగా, హైదరాబాద్ క్రికెటర్, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కానుండటం చర్చనీయాంశమైంది. అజహర్ కంటే ముందే పలువురు క్రికెటర్లు వివిధ రాష్ట్రాల్లో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే, తెలుగు రాష్ట్రాలలో ఒక జాతీయ క్రికెటర్, దేశానికి కెప్టెన్‌గా చేసిన వ్యక్తి మంత్రి కావడం బహుశా ఇదే మొదటిసారి.


అజహరుద్దీన్ రాజకీయ ప్రస్థానం .. అజహరుద్దీన్ 2009లోనే యూపీలోని మొరాదాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. 2014లో రాజస్థాన్‌లోని టోంక్ నుంచి ఓటమి పాలయ్యారు. 2023లో కాంగ్రెస్ తరఫున హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగి పరాజయం చవిచూశారు. కానీ, ప్రస్తుతం అదే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావడం, ఆయనకు ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కనుండటం అజహర్‌కు కలిసి వచ్చిన పరిణామంగా చెప్పవచ్చు.



అజహర్ సమకాలికులు - మంత్రులైన క్రికెటర్లు .. నవజ్యోత్ సింగ్ సిద్ధూ (సిక్సర్ల సిద్ధూ): టీమ్ ఇండియాలో అజహర్‌కు సమకాలికుడైన సిద్ధూ, పంజాబ్ ప్రభుత్వంలో 2017-19 మధ్య పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. కీర్తి ఆజాద్ (ప్రపంచ కప్ విజేత): 1983లో ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్, ఎంపీగా పలుసార్లు ఎన్నికై కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. 2014లో బిహార్‌లోని దర్భంగా నుంచి గెలిచారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ తరఫున వర్ధమాన్-దుర్గాపూర్ నుంచి నెగ్గారు.



మనోజ్ తివారీ (బెంగాలీ తివారీ): టీమ్ ఇండియాలో రెగ్యులర్ సభ్యుడు కాలేకపోయినా, బెంగాల్ జట్టు తరఫున భారీగా పరుగులు చేసిన మనోజ్ తివారీ, టీఎంసీ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూనే బెంగాల్ జట్టు సారథ్యం కూడా నిర్వహించారు. 2021లో ఎమ్మెల్యే అయిన తివారీ ఇప్పటికీ మంత్రిగానే కొనసాగుతున్నారు. చేతన్ చౌహాన్ (సునీల్ గావస్కర్‌తో ఓపెనర్): టీమ్ ఇండియా తరఫున 40 టెస్టులు ఆడిన చేతన్ చౌహాన్, యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. దిగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్‌తో ఓపెనింగ్ జోడీగా గుర్తింపు పొందారు. ఆయన 2020లో కరోనాతో మరణించారు. వీరు కాక, పలువురు క్రికెటర్లు చట్టసభలకు ఎన్నికైనా, మంత్రి పదవులు మాత్రం చేపట్టలేదు. క్రీడా మైదానం నుంచి రాజకీయ మైదానంలోకి అడుగుపెట్టిన ఈ ఆటగాళ్లు తమ రెండో ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: