వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు, ప్రముఖ విద్యుత్‌ కార్ల తయారీ కంపెనీ టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఇప్పుడు ఏం చెప్పినా అదో సంచలనం. ఇటీవల వాట్సాప్ విషయమే దీనికి నిదర్శనం. ఇక ఇప్పుడు మస్క్ ప్రజలకు మరో ఛాలెంజ్ చేశారు. కర్బన ఉద్గారాలను తగ్గించే సాంకేతికతను అభివృద్ధి చేసే యజ్ఞంలో భాగం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాదు దానికి అవసరమైన ప్రత్యేక టెక్నాలజీని ఎవరైనా అభివృద్ధి చేస్తుంటే వారిని ప్రోత్సహించేందుకు భారీ నజరానా కూడా ఇస్తానని ప్రకటించారు. ఈ సాంకేతికతను అభివృద్ధి చేసిన వారికి 100 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.730 కోట్లు) బహుమానంగా ఇస్తానని, మరిన్ని వివరాలను వచ్చే వారం వెల్లడిస్తానని మస్క్ తన ట్విటర్‌లో ప్రకటించారు.

కర్బన ఉద్గారాల మూలంగా భూగోళం తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. భూతాపం ఏటా పెరుగుతూ మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో ఉద్గారాలను తగ్గించేందుకు సైంటిస్టులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు, పరిశోధనా సంస్థలు ఇందులో కొద్దికొద్దిగా ముందడుతు వేస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఆచరణయోగ్యమైన, సమర్థమైన టెక్నాలజీ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే అసాధ్యాలను సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మస్క్ మళ్లీ తెరమీదకొచ్చారు.

కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం టెక్నాలజీని తయారు చేయడంలో పోటీ పెంచితే వీలైనంత త్వరగా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని మస్క్ భావించారు. ఈ నేపథ్యంలో ఇంత భారీ ఆఫర్‌ను ఆయన ప్రకటించారు. మస్క్ ప్రకటించిన ఈ ఆఫర్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన పిలుపుతో ఎంతమంది యువ సైంటిస్టులు తమ బుర్రలకు పదును పెట్టి సరికొత్త ఆవిష్కరణలను సృష్టిస్తారో చూడాలి. ఒకవేళ ఈ ఐడియా సక్సెస్ అయితే ప్రపచం రూపు రేఖలే మారిపోతాయి. మస్క్ ప్రపంచ కుబేరుడిగానే కాక.. యుగపురుషుడిగా కూడా మారతాడనడంలో అతిశయోక్తి ఉండదు.

ఇదిలా ఉంటే అమెరికా 46వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌ కూడా కర్బన ఉద్గారాలకు వ్యతిరేకంగానే ఉన్నారు. వాటిని తగ్గించే టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని ఆయన ఇంతకుముందే వెల్లడించారు. వాతావరణ మార్పుల సమస్యను అధిగమించడంలో భాగంగా దీనిపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే నిపుణుడైన జెన్నిఫర్‌ విల్‌కాక్స్‌కు కేంద్ర ఇంధన విభాగంలో కీలక పదవి కట్టబెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: