వాషింగ్టన్: అమెరికన్ ప్రేవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అద్భుత రికార్డు సాధించింది. ఇప్పటివరకు భారత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఒకేసారి 143 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పింపిన అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇన్నాళ్లూ ఈ రికార్డు ఇస్రో పేరిట ఉంది. 2917లో పీఎస్ఎల్‌వీ రాకెట్ సాయంతో ఇస్రో మొత్తం 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. ఇన్ని శాటిలైట్లను ఒకేసారి పంపడం అంతరిక్ష పరిశోధనా సంస్థల చరిత్రలో అదే తొలిసారి.

ఇప్పటివరకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు కానీ, యూరోపియన్ స్సేస్ ఏజెన్సీ కానీ, మరే ఇతర స్పేస్ ఏజెన్సీ కానీ అప్పటివరకు ఆ ఘనత సాధించలేదు. దీంతో ఇస్రో గొప్పతనం ప్రపంచ దేశాలకు పాకింది. అయితే ఈ రికార్డును ఇప్పుడు స్పేస్ ఎక్స్ అధిగమించింది. స్పేస్ ఎక్స్ ప్రయోగించిన ట్రాన్స్‌పోర్టర్-1 రాకెట్లో.. 133 ప్రభుత్వ, ప్రైవేటు ఉపగ్రహాలు ఉన్నాయి. వీటితోపాటు మరో 10 స్టార్ లింక్ శాటిలైట్స్ ఉన్నాయి. అంటే మొత్తం 143 ఉపగ్రహాలను స్పేస్ఎక్స్ రాకెట్ ఒకేసారి అంతరిక్షంలో తీసుకెళ్లిందన్నమాట. స్మాల్‌శాట్ రైడ్‌షేర్ ప్రోగ్రామ్ మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగం నిర్వహించినట్లు స్పేస్ఎక్స్ పేర్కొంది.

ఇప్పటికే స్పేస్ ఎక్స్ ఇలాంటి ఘనతలను అనేకం సాధించింది. ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఎదగడంలో కూడా స్పేస్ ఎక్స్ ప్రముఖ పాత్ర పోషించింది. స్పేస్ ఎక్స్‌తో పాటు మస్క్‌కే చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా కూడా అద్భుత లాభాలను సాధించింది. దీంతో కేవలం ఒకే ఒక్క ఏడాదిలో మస్క్ ప్రపంచ కుబేరుడిగా ఎదిగాడు. 2019లో కేవలం 30 బిలియన్ డాలర్ల సంపదతో ఉన్న మస్క్ 2020 ముగిసే సమయానికి 150 బిలియన్ డాలర్ల సంపదను పెంచుకున్నాడు. మొత్తంగా 188 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు. దీంతో అప్పటివరకు 185 బిలియన్ డాలర్లతో నెంబర్ వన్ బిలియనీర్‌గా ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రెండో స్థానానికి పడిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: