
అయితే ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే కన్నబాబు కలగజేసుకుని నామినేషన్ విత్‌డ్రా చేయించాలంటూ బుధవారం ఫోన్‌లో సంతోష్‌పై బెదిరింపులకు దిగారు. అయితే ఈ సంభాషణను రికార్డు చేసిన బాధితుడు రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నామినేషన్ విత్‌డ్రా చేయించకపోతే జైలుకు పంపిస్తానని ఎమ్మెల్యే బెదిరించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఆడియో రికార్డును కూడా పోలీసులకు అందజేశారు. దీంతో బాధితుడికి మద్దతుగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి సుందరపు విజయ్ కుమార్ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. ఈ వ్యవహారంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, నామినేషన్ వేసిన అభ్యర్థికి ఫోన్ చేసి బెదిరించారనే ఆరోపణలతో ఏపీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కన్నబాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆడియో టేప్‌ను తెలుగు దేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అలాగే ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ‘‘పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ భూస్వామ్య, పెత్తందారీ పోకడలు బుసలు కొడుతున్నాయి. యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు (వైసీపీ) పంచాయితీ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థి ఉపసంహరించుకోకపోతే మీరు (మీ మామ) జైలుకు పోతారంటూ, నీకు రావలసిన డబ్బులు రావంటూ అభ్యర్థి అల్లుడిని బెదిరిస్తున్నారు? వీళ్లా రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులు కాపాడేది? వీళ్లా ప్రజాభ్యున్నతికి పాటు పడేది? బంధువును రిక్వెస్ట్ చేసిన అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి, బెదిరించిన కన్నబాబుపై అసలు కేసులు పెట్టకపోవడం పోలీసుల దుర్మార్గానికి, బానిసత్వానికి నిదర్శనం.’’ అంటూ టీడీపీ ఈ వ్యవహార విషయమై తీవ్రంగా స్పందించింది.