తెలుగు రాష్ట్రాలు “మొంథా” తుపాన్ తాకిడికి తేరుకోవడం మొదలుపెట్టిన వేళ, వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిక జారీ చేసింది. రేపు (నవంబర్ 4) కొత్త అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశముందని తెలిపింది. అండమాన్ సమీప ప్రాంతంలో ఈ అల్పపీడనం రూపుదిద్దుకోనుందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ వర్షాల ప్రభావానికి లోనవుతాయని అంచనా వేసింది. దీంతో రాబోయే మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల ప్రజలు వర్షాలకు, బలమైన గాలులకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు .. విశాఖ వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో (విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం) వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది.
 

దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ తేలికపాటి వానలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని అంచనా. రాయలసీమ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణలో మళ్లీ భారీ వర్షాల సూచన .. హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా ఇదే సిగ్నల్ ఇచ్చింది. రేపు అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడితే, దాని ప్రభావం తెలంగాణపై కనిపిస్తుందని తెలిపింది. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరిక ఇచ్చింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులు తీరప్రాంతాల నుంచే కాకుండా అంతర్గత జిల్లాల్లో కూడా ప్రభావం చూపే అవకాశముందని తెలిపింది.



రైతులకు హెచ్చరిక, జాగ్రత్తలు అవసరం .. వాతావరణ శాఖ తాజా అప్‌డేట్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ రైతులకు సూచనలు జారీ చేసింది. పంటలు నీటిలో మునిగిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కోతకు సిద్ధమైన పంటలను రక్షించుకోవాలని సలహా ఇచ్చింది. పశువులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఎలక్ట్రిక్ తీగల దగ్గర ఉండకూడదని సూచించింది. ప్రజలకు హెచ్చరిక .. వాతావరణ శాఖ ప్రకారం, అల్పపీడనం బలపడితే అది మరింత తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే మూడు రోజులు ప్రజలు బయటకు వెళ్లే ముందు వాతావరణ అప్‌డేట్‌లు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది. తెలుగు రాష్ట్రాలు మరోసారి వర్షాల బీభత్సానికి సిద్ధమవుతున్నాయి. మొంథా ప్రభావం తగ్గకముందే కొత్త అల్పపీడనం సవాల్ విసరడం ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: