సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. ఆదివారం తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి. ఈ దారుణ ఘటనలో మరణించిన వారి మృతదేహాలను గ్రౌండ్‌ఫ్లోర్‌లోని వంటగది ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకోవడంతో, ప్రమాదానికి ప్రధాన కారణం సిలిండర్ పేలుడు అని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరణించిన 23 మందిలో అధిక శాతం మంది నైట్‌క్లబ్ సిబ్బందే ఉండటం అత్యంత విషాదకరం. ముఖ్యంగా వంటగదిలో పనిచేసే కార్మికులు, ముగ్గురు మహిళలు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు గోవా డీజీపీ అలోక్ కుమార్ స్పష్టం చేశారు. మెట్ల మార్గం వద్ద కూడా రెండు మృతదేహాలు లభించాయి. సిబ్బంది నిర్లక్ష్యమా? లేక యాజమాన్యం తప్పిదమా? అన్న కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. అదేవిధంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవా ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు. పండుగ వాతావరణంలో ఉండాల్సిన గోవాలో ఈ విషాదం తీవ్ర ఉద్రిక్తతకు, శోకానికి దారితీసింది. మృతుల కుటుంబాల రోదనలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఈ మారణహోమానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి