రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రధానంగా రెడ్‌జోన్లు, కంటైన్‌మెంట్‌ జోన్లలో పరీక్షలపై దృష్టి సారించిన అధికారులు విస్తృతంగా నిర్వహిస్తున్నారు.   గుజరాత్‌ నుంచి తెలుగు మత్స్యకారులను స్వస్థలాలకు తరలింపుపై సీఎం ఆరా తీశారు. 4,065 మంది మత్స్యకారులు స్వస్థలాలకు బయల్దేరారని అధికారులు సీఎంకు వివరించారు. గడచిన 24 గంటల్లో 73 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, గడచిన 24 గంటల్లో 7,727 పరీక్షలు చేశామని అధికారులు తెలిపారు.

 

శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ల్యాబ్‌లు సిద్ధం అవుతుండగా విజయనగరం, పశ్చిమ గోదావరిలో వీటి ఏర్పాటుపై దృష్టి సారించారు.  ఇప్పటి వరకూ 88,061 పరీక్షలు చేశామని, ప్రతి మిలియన్‌కు 1649 పరీక్షలు చేశామని తెలిపారు. క్లస్టర్ల వారీగా కూడా వెరీ యాక్టివ్, యాక్టివ్, డార్మంట్‌ క్లస్టర్లు గుర్తించామని, శనివారం నాటికి శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు ల్యాబ్‌లు సిద్ధం చేశామని సీఎంకు అధికారులు తెలిపారు.  కుటుంబ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలపై సీఎం ఆరా తీశారు.

 

ఇప్పటి వరకూ 12,247 పరీక్షలు చేశామని సీఎం దృష్టికి అధికారులు తెచ్చారు. మిగిలిన వారికి కూడా వీలైనంత త్వరగా పరీక్షలు చేయాలని జగన్ ఆదేశించారు.  కాగా,  టెలిమెడిసిన్‌లో భాగంగా వైద్యం పొందుతున్న వారికి మందుల సరఫరా విధానం సమర్థంగా ఉండాలని సీఎం జగన్‌ సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: