
శాంతి, సహనంతో ఉండాలని, ఓర్పుతో దేన్నైనా సాధించవచ్చని ప్రపంచానికి బోధించిన భారతదేశమంటే అందరికీ చులకనే. ఎందుకంటే మనం చెప్పేవి మంచిమాటలు.. అవి ఎవరూ తలకెక్కించుకోరు. మన మార్గం అహింసాయుత మార్గం.. ఎవరికీ అది నచ్చదు. ఈ బలమైన లక్షణాలనే ప్రపంచంలోని మిగతా దేశాలు బలహీనంగా భావిస్తున్నాయి. అందుకే అగ్రరాజ్యం మరోసారి భారత్‌మీదకు దండెత్తడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.
భారత్‌తో మరో వాణిజ్య యుద్ధానికి అమెరికా రంగం సిద్ధం చేసుకుంటోంది. అమెరికన్ ఈ-కామర్స్ కంపెనీలపై డిజిటల్ సేవల పన్ను విధించారనే అక్కసుతో భారత్ సహా ఆరు దేశాలపై ప్రతీకార చర్యలకు బైడెన్ సర్కార్ దిగుతోంది. వీటిపై ప్రజాభిప్రాయం కోరుతూ ది యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్‌టీఆర్) ప్రకటన జారీ చేసింది. అమెరికా ప్రతీకార చర్యలను ఎదుర్కోవడానికి సిద్ధమైన దేశాల జాబితాలో మనతోపాటు ఇటలీ, బ్రిటన్, టర్కీ, స్పెయిన్, ఆస్ట్రియా ఉన్నాయి. అమెరికా ఎటువంటి చర్యలు చేపడుతుందో చూసి, వాటిపై సంబంధిత వర్గాలతో చర్చించి, వాణిజ్య, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
25 శాతం దిగుమతి పన్ను?
ప్రపంచ డిజిటల్ రంగంలో అగ్రస్థాయి కంపెనీలన్నీ అమెరికాకు చెందినవే. తమ సంస్థలపై వివక్ష చూపుతున్నారన్న కారణంతో అమెరికా వాణిజ్య చట్టంలోని 301 సెక్షన్ ప్రకారం ఆరు దేశాలపై 2020 జూన్‌లో యూఎస్ సర్కారు దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో ముగిసింది. ఎంపిక చేసిన భారత ఉత్పత్తులపై 25 శాతం వరకు దిగుమతి సుంకం విధించే అవకాశం కనపడుతోంది. రొయ్య పిల్లలు, ఫర్నిచర్, బంగారం, వెండి ఆభరణాలు, బాస్మతి బియ్యం తదితర వస్తువులు ఈ జాబితాలో ఉండే అవకాశం కనపడుతోంది. అమెరికన్ కంపెనీలు మన ప్రభుత్వానికి ఏటా రూ.400 కోట్లు డిజిటల్ పన్ను చెల్లించాల్సి రావచ్చని అంచనా. అన్ని కంపెనీలకు సమాన అవకాశాలు కల్పించడం కోసం ఈ చట్టాన్ని తెచ్చినట్లు భారత ప్రభుత్వం అమెరికాకు స్పష్టం చేసింది.