మన అందరికి తెలిసి త్వరగా చేసే టిఫిన్ ఏదన్నా ఉంది అంటే అది ఒక్క ఉప్మా అనే చెప్పాలి. చాలా సింపుల్ గా తక్కువ సమయంలో చేసేయవచ్చు. అయితే ఉప్మా అంటే మన అందరికి తెలిసినది బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ ఉప్మా, సేమ్యా ఉప్మా. కానీ బ్రేడ్ తో కూడా ఉప్మా చేస్తారని చాలా మందికి తెలియదు. చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి.

కావలిసిన పదార్ధాలు :
బ్రెడ్‌ స్లైసులు - ఐదు, ఉల్లిపాయ, టొమాటో - ఒక్కోటి చొప్పున పచ్చిమిర్చి - రెండు, అల్లంతరుగు - కొద్దిగా, పసుపు - చిటికెడు, సాంబార్‌పొడి - చెంచా, నెయ్యి - నాలుగు చెంచాలు, ఉప్పు - తగినంత, ఆవాలు, సెనగపప్పు - అరచెంచా చొప్పున, జీడిపప్పు -కొద్దిగా
తయారు చేసే విధానం:
ముందుగా బ్రెడ్‌ స్లైసుల్ని ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి  అందులో రెండు చెంచాల నెయ్యి వేసి జీడిపప్పును వేపుకుని పక్కన పెట్టుకోవాలి.తరువాత  బ్రెడ్‌ ముక్కల్ని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి వేయాలి. అది కరిగాక ఆవాలూ, సెనగపప్పు , ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక టొమాటో ముక్కలు, పసుపు, సాంబార్‌ పొడీ, ఉప్పు వేసి మంట తగ్గించాలి. టొమాటోలు మెత్తగా అయ్యాక బ్రెడ్‌ ముక్కలు వేసి బాగా కలపాలి. రెండు మూడు నిమిషాలయ్యాక దింపేయాలి.
ఉప్మా అంటే ఇష్టపడని వారు కూడా ఈ బ్రెడ్ ఉప్మాని ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి.

బ్రెడ్‌ రోల్స్‌: ఈ బ్రేడ్ రోల్స్ ను పిల్లలు బాగా ఇష్టంగా తింటారు.సాయంత్రం వేళ బ్రేడ్ తో ఈ వెరైటీ వంటకాన్ని తయారుచేయండి.చాలా క్రిప్సీగా,రుచికరంగా ఉంటాయి.
కావలసినవి: బ్రెడ్‌ స్లైస్‌ - 10(అంచులు తొలగించి పెట్టుకోవాలి), క్యారెట్‌ తురుము - 1 కప్పు, పనీర్‌ తురుము - పావు కప్పు, ఉల్లిపాయ - 1, పచ్చి మిర్చి - 2, మిరియాల పొడి - పావు టీ స్పూన్, వెన్న - 1 టీ స్పూన్‌, కారం - అర టీ స్పూన్, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం :
ముందుగా స్టవ్‌ ఆన్‌ చేసుకుని కళాయిలో వెన్న వేసుకుని, కరిగిన వెంటనే అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్‌ తురుము వేసి దోరగా వేయించుకోవాలి.అవి వేగిన తరువాత పనీర్‌ తురుమును కూడా వేసి వేయించుకోవాలి.తరువాత ఉప్పు, మిరియాల పొడి, కారం ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకుని, ఒక నిమిషం పాటు వేగాక స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఒక్కో బ్రెడ్‌ స్లైస్‌లో వేసుకుని రోల్‌లా చుట్టుకోవాలి. రోల్‌ విడిపోకుండా ఉండేందుకు బ్రెడ్‌ అంచుల్ని కాస్త తడిచేసి లోపలికి నొక్కేయాలి. అన్ని బ్రెడ్‌ ముక్కల్ని ఇలాగే చేసి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాండీలో డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె బాగా కాగిన తరువాత ఒక్కొక్క బ్రేడ్ రోల్ తీసుకుని నెమ్మదిగా నూనెలో వేయాలి. అలా అన్ని బ్రేడ్ రోల్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి తినడానికి భలే రుచిగా ఉంటాయి.







మరింత సమాచారం తెలుసుకోండి: