తెలుగు అకాడమీ స్కాంలో తవ్వేకొద్దీ కొత్త నిజాలు బయటపడుతున్నాయి. గోల్ మాల్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ప్రధాన నిందితుడు సాయి కుమార్ గత 12 ఏళ్లలో దాదాపు 200 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తేలింది. అతని  వెనక ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. తెలుగు అకాడమీ స్కామ్ లో సిసిఎస్ పోలీసుల దర్యాప్తులో అక్రమాలన్నీ బయటికి వస్తున్నాయి. నిధులను ఏడాది, రెండేళ్ల నుంచి కాదు ఏకంగా 12 ఏళ్ల నుంచి నొక్కేస్తున్నారని తేలింది. ప్రధాన నిందితుడు సాయికుమార్ ఏపీ హౌసింగ్ బోర్డు లో 40 కోట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో 15 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖ లో 45 కోట్లు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్ లో 15 కోట్ల డిపాజిట్లను దారి మళ్ళించి విత్ డ్రా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తెలుగు అకాడమీకి చెందిన 64 నర కోట్లను ఏపీ మర్కంటైల్ సొసైటీ శాఖకు మళ్ళించి, వాటాలుగా పంచుకున్న నిందితులు గత 12 ఏళ్లలో మొత్తం రెండు వందల కోట్లు  దోచేశారని సిసిఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ అక్రమాల ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. పన్నెండేళ్ల కిందట ముఠాగా ఏర్పడిన సాయి కుమార్, అతని అనుచరులపై ఇప్పటికే ఏడు కేసులున్నాయి. ఈ బ్యాచ్ ఏపీలోనూ రెండు ప్రభుత్వ శాఖల ఫిక్స్డ్ డిపాజిట్లను కాజేసిసినట్లు పోలీసులు గుర్తించారు. సాయికుమార్ జాతీయ, కార్పొరేట్, సహకార బ్యాంకుల మేనేజర్లతో  పరిచయాలు పెంచుకొని ఎఫ్ డిల సొమ్మును కాజేసెందుకు కుట్రలు పన్నాడు. కమిషన్ల ఆశచూపి ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి ఎఫ్ డిల సొమ్మును స్వాహా చేశాడు. ఒప్పందం చేసుకున్న బ్యాంకుల్లోనే ప్రభుత్వ శాఖల ఎఫ్ డి లు కాజేసే లా స్కెచ్ వేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది  . ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయి కుమార్ తో పాటు తొమ్మిది మంది నిందితుల కస్టడీ ముగియడంతో వారిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను చంచల్గూడ జైలుకు తరలించారు.

 దర్యాప్తులో పురోగతి, నిందితులు పంచుకున్న వాటాలపై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు తొమ్మిది మంది నిందితులను మరో నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిసిఎస్ పోలీసులు నాంపల్లి కోర్టు ను కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు 9వ తేదీన అరెస్టు చేసిన వినయ్ కుమార్, రమణారెడ్డి, భూపతి లను నాంపల్లి కోర్ట్ నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. వాళ్లను సిసిఎస్ పోలీసులు ఈనెల 16న కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: