జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో బీజేపీ నేతల తీరు చాలా విచిత్రంగా ఉన్నట్లుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల ప్రచారం ముగియటానికి గడువు దగ్గర పడుతున్నా ఇంత వరకు పవన్ అసలు ప్రచారానికే దిగలేదు. అసలు గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దిగాలని అనుకున్న జనసేనపై ఒత్తిడి తెచ్చి మరీ పోటీ నుండి విత్ డ్రా చేయించిన విషయం తెలిసిందే. అప్పుడేమో పవన్ తమకు ప్రచారం చేస్తాడని స్వయంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. పవన్ తో భేటీ అయిన కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సరే బీజేపీ రాయబారం కారణంగా పోటీ నుండి తప్పుకోగానే పవన్ ప్రచారంలోకి దూకేస్తాడని అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఢిల్లీ నుండి కబురు రావటంతో అర్జంటుగా హస్తినాపురంకు వెళ్ళిన పవన్ మూడు రోజులు అక్కడే ఉండిపోయారు. ఎందుకెళ్ళారో అక్కడ ఏమి చేశారో కూడా ఎవరికీ తెలీదు.




సరే ఢిల్లీ టూర్ ను పక్కనపెట్టేసినా మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు వచ్చిన తర్వాతైనా గ్రేటర్ ఎన్నికల్లో పవన్ ఎక్కడా కనబడలేదు.  29 సాయంత్రానికి ప్రచారం ముగిసిపోతుంది. పార్టీ తరపున ఢిల్లీ నుండి అగ్రనేతలను, కేంద్రమంత్రులను, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా ప్రచారానికి పిలిపించుకున్న కమలం నేతలు హైదరాబాద్ లో నే ఉన్న పవన్ తో మాత్రం ఎందుకు ప్రచారం చేయించటం లేదు ? అన్నదే ఎవరికీ అర్ధం కావట లేదు. బహుశా పవన్ ప్రచారం చేస్తే తమకు నష్టం జరుగుతుందన్న అనుమానం ఏమన్నా ఉందా బీజేపీ నేతల్లో అనిపిస్తోంది. ఎలాగంటే పవన్ ప్రచారంలోకి రాగానే కేసీయార్ మళ్ళీ తెలంగాణాపై ఆంధ్రా పెత్తనం అనే ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తాడనే అనుమానం బీజేపీ నేతల్లో ఉందట.




ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే అవకాశం కేసీయార్ కు ఇవ్వకూడదంటే గ్రేటర్ ఎన్నికల నుండి పవన్ను దూరంగా పెట్టడం ఒకటే మార్గమన్నట్లుగా కొందరు నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారట. అందుకనే పోటీ నుండి తప్పించినా ప్రచారంలోకి మాత్రం దింపలేదని సమాచారం. దానికి తగ్గట్లే కమలం నేతలు వ్యూహాత్మకంగా ఓల్డ్ సిటినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ అని, రోహింగ్యాలని, టెర్రరిస్టులంటూ ఎంఐఎం పార్టీకి కేసీయార్ కు ఉన్న సాన్నిహిత్యాన్ని జనాల్లోకి ఎక్కించేందుకే  బీజేపీ నేతలు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.  నిజానికి  ఈ విషయాలను పవన్ ప్రస్తావించే అవకాశం లేదు. పవన్ ప్రస్తావించినా వినే జనాలూ లేరు. అందుకనే అనేక అంశాలను దృష్టిలో పెట్టుకునే పవన్ను హోలుమొత్తం మీద గ్రేటర్ ఎన్నికలకే దూరం పెట్టేసినట్లు అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: