తమిళనాడు రాజకీయాల్లో కాలు పెడదామని కమలంపార్టీ దశాబ్దాలపాటు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఒకవైపు డీఎంకే చీఫ్ ఎంకే కరుణానిధి, మరోవైపు పురట్చితలైవి  జయలలిత కారణంగా సెంటీమీటర్ భూమి కూడా దొరకలేదు. ఇద్దరు ఉప్పు-నిప్పులాంటి ప్రత్యర్ధులే కానీ బీజేపీ విషయంలో మాత్రం ఏకమైనట్లుగా ఇద్దరు కలిసి కమలం వికసించకుండా మొగ్గలోనే చిదిమేశారు. దాని ఫలితంగా దక్షిణాదిలో ప్రత్యేకించి తమళదేశంలో బీజేపీ పప్పులుడకలేదు. ఇంతకాలానికి అంటే ఇద్దరు ఉద్దండులు లేని మొదటి ఎన్నికలో అవకాశం వచ్చింది. అయితే ఇపుడు కూడా పెద్ద అవకాశాలున్నట్లు కనబడటంలేదు. ఎందుకంటే అధికార ఏఐఏడీఎంకే కూటమిలో బీజేపీ 20 అసెంబ్లీలకు పోటీ చేస్తోంది.




అధికారపార్టీకే దిక్కులేదంటే ఇక కూటమిలోని పార్టీలకు ఏముంటుంది సీన్. అందుకనే అన్నీ ఆలోచించి చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్లుంది. అదేమిటయ్యా అంటే తలైవా రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించటం. ఏదో విధంగా తమిళజనాల్లో చొచ్చుకుపోవాలంటే సొంతబలం సరిపోదని అర్ధమైపోయింది. పళనిస్వామిని ముందుపెట్టి ప్రభుత్వంలో వెనకనుండి చక్రం తిప్పినట్లు కాదు కదా ఎన్నికల్లో పోటీచేసి గెలవటమంటే. అన్నీడీఎంకేని మాత్రమే నమ్ముకుంటే మరో ఐదేళ్ళవరకు వెయిట్ చేయాల్సిందే అని డిసైడ్ అయిపోయినట్లుంది. అందుకనే హఠాత్తుగా రజనీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించేసింది. ఇలాగైనీ రజనీ అభిమానులను తద్వారా తమిళులను దగ్గర చేసుకోవాలనేది కమలం ఆలోచనగా అర్ధమైపోతోంది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నిజంగానే రజనీకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డే ఇవ్వదలచుకుంటే ఎన్నికల తర్వాత కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఒకవేళ ఓడిపోతే పళనిస్వామి ప్రభుత్వమే కానీ కేంద్రంలోని నరేంద్రమోడి ప్రభుత్వానికి ఏమీ కాదుకదా. అలాంటిది ఫాల్కే 51వ పురస్కార గ్రహీతగా ఇప్పటికిప్పుడు సరిగ్గా పోలింగ్ ముందే రజనీకి ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది ? ముందే చెప్పుకున్నట్లు ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకే బీజేపీ చివరి అస్త్రాన్ని ప్రయోగించింది. మరి అస్త్రం టార్గెట్ ను చేరుతుందా ? లేకపోతే టార్గెట్ మిస్సవుతుందా ? అనేది కొద్దిరోజుల్లోనే తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: