యూపీ సీఎం అభ్య‌ర్థి తానేన‌ని చెప్ప‌డం ద్వారా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లను కాంగ్రెస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న‌ట్టు చాటిన ప్రియాంక గాంధీ ఒక్క‌రోజులోనే మాట మార్చేశారు. అస‌లు తాను సీరియ‌స్‌గా ఆ మాట‌ అన‌లేద‌ని, మీడియా ప్ర‌తినిధులు ప‌దే ప‌దే ఆ ప్ర‌శ్న అడ‌గ‌డంతో విసుగొచ్చి అలా చెప్పాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తేల్చేశారు. దేశ రాజ‌కీయాల్లో అత్యంత ప్రాధాన్య‌మున్న కీల‌క రాష్ట్రానికి సంబంధించి గంట‌ల వ్య‌వ‌ధిలోనే ప్రియాంక గాంధీ ఇలా భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం విస్తు గొలిపే అంశ‌మే. అయితే నిజంగానే ఆమె అస‌హ‌నంతోనే సీఎం అభ్య‌ర్థిని  తానేన‌ని చెప్పారా అంటే రాజ‌కీయాల్లో ఓన‌మాలు తెలిసిన‌వారు ఎవ‌రూ న‌మ్మ‌రు. అందుకు కార‌ణాలు చాలానే క‌నిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజం పొందాలంటే యూపీలో మళ్లీ ప్రాభ‌వం పెంచుకోవాల‌ని, అందుకు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్రియాంక గాంధీని ప్ర‌క‌టించాల‌ని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు చాలా కాలంగానే కోరుతున్నారు. అందుకు సోనియా కుటుంబం కూడా సానుకూలంగా ఉండ‌టం మూలానే ప్రియాంక యూపీపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. రాహుల్ గాంధీ 2024 ఎన్నిక‌ల‌నాటికి ప్ర‌ధాని అభ్య‌ర్థి అయితే ప్రియాంక గాంధీ యూపీ రాజ‌కీయాల్లో కొన‌సాగ‌వ‌చ్చ‌ని భావించారు.
 
అయితే కాంగ్రెస్ అధిష్ఠానం ఊహించిన‌ట్టుగా ఆ పార్టీకి అటు యూపీలోగానీ, ఇటు దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లోగానీ ఆశించినంత సానుకూల అంశాలేమీ క‌నిపించ‌డంలేదు. వ‌రుస దెబ్బ‌లు తింటున్నా మాయావ‌తి కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ముందుకు రాలేదు. కార‌ణాలేమైనా కావ‌చ్చుగానీ ఇప్ప‌టిదాకా మోదీకి దీటైన అభ్య‌ర్థిగా రాహుల్ గాంధీ ప్ర‌జామోదం సాధించ‌లేక‌పోయారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆ పార్టీకి మిగిలిన ఏకైక ఆశాకిర‌ణం ప్రియాంక గాంధీ మాత్ర‌మే. ఆమెను ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని, ఆహార్యంలో ఇందిరాగాంధీని త‌ల‌పించే ప్రియాంక పోరాట స్ఫూర్తిలోనూ నాయ‌న‌మ్మ‌ వార‌సురాలిగా నిల‌వ‌గ‌ల‌ర‌ని దేశ‌వ్యాప్తంగా పార్టీ క్యాడ‌ర్ నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

 
ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆమె యూపీ ఎన్నిక‌ల్లో సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌చారం జ‌రిగితే కాస్తో కూస్తో అక్క‌డ పార్టీ ప‌రిస్థితి మెరుగుప‌డుతుందేమో కానీ చెప్పుకోద‌గ్గ మార్పులేమీ జ‌రిగిపోవు. అటు బీజేపీ, ఇటు ఎస్పీల మ‌ధ్య  అక్క‌డ హోరాహోరీ పోరు జ‌ర‌గ‌బోతోంద‌ని ఇప్ప‌టికే స‌ర్వేల‌న్నీ ఘోషిస్తున్నాయి. ప్రియాంక బ‌రిలో ఉంటే ఇక ఆ త‌రువాత కూడా ఆమె యూపీకే ప‌రిమితం కావాల్సివ‌స్తుంది. ఎందుకంటే రేపు ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఆమె ప్ర‌చారం మొద‌లుపెడితే యూపీ ఎన్నిక‌ల్లోనే ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తే దేశానికి ప్ర‌ధాని ప‌ద‌వి కోసం ఎలా పోటీ ప‌డ‌తార‌న్న విమ‌ర్శ‌లు మొద‌ల‌వుతాయి. ప్రియాంక ప్ర‌క‌ట‌న త‌రువాత దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల నుంచి వెల్ల‌డైన ఈ అభిప్రాయాల‌ను క్రోడీక‌రించుకున్నాక‌నే ప్రియాంక త‌న మాట వెన‌క్కుతీసుకున్న‌ట్టు తెలుస్తోంది. సో.. ఇప్పుడు యూపీ ఎన్నిక‌ల్లో బ‌ల‌హీన వ‌ర్గాల నుంచి సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి ప్రియాంక ప్ర‌చారం చేయ‌డం, ఆ త‌రువాత రాహుల్ గాంధీతో క‌లిసి ఇక జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి సారించ‌డం ప్రియాంక ముందున్న మార్గాల‌ని అనుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: