సినిమాల ప్రభావంపై సమాజంపై ఉంటుందా అని అడిగితే తప్పకుండా ఉంటుందని చెప్పాలి. మన సమాజంలో సినిమా ఓ బలమైన మాధ్యమం.. సినిమాలు మన జీవితంలో అంతర్భాగం. సినిమాలు మన నిత్యజీవితంలో ఓ విడదీయరాని వినోదంగా మారాయి. అలా తెరపై చూసే బొమ్మలు మన నిజ జీవితాలనూ ప్రభావితం చేస్తాయి. గతంలో శంకరాభరణం సినిమా వచ్చిన తర్వాత అనేక మంది తమ పిల్లలకు శాస్త్రీయ సంగీతం నేర్పించారట. విశ్వనాథ్ సినిమాలు చూసి ఎందరో కళాకారులు తయారయ్యారంటారు.


అలాగే శివ సినిమా వచ్చాక కాలేజీల్లో గూండాయిజం పెరిగిందని చెబుతారు. అంత ప్రభావం ఉంటుంది సినిమాది సమాజంపై. కానీ ఇప్పటి సినిమాల్లో చాలా వరకూ హీరోలకు నెగిటివ్ క్యారెక్టర్లే వస్తున్నాయి. అల్లరి చిల్లరగా తిరిగేవాడే మన హీరో.. ఇక తాజాగా వచ్చిన పుష్ప సినిమాలో అయితే.. ఏకంగా ఓ గంధపు చెక్కల స్మగ్లర్‌నే హీరోగా చూపించారు. స్మగ్లర్ జీవితాన్ని గ్లామర్‌గా చూపించారు. ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియాగా విడుదలై ఇతర భాషల్లోనూ సత్తా చాటుతోంది.


అయితే.. ఈ సినిమాపై తాజాగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. సినిమాలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయన్న గరికపాటి సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా  సినిమాలు ఉండటం లేదన్నారు. అదే సమయంలో పుష్ప సినిమాపై గరికపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చందనం స్మగ్లర్‌ని హీరోగా ఎలా చూపిస్తారని ఆయన ప్రశ్నించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. సినిమా మొత్తం స్మగ్లింగ్‌ చూపించి.. చివరి ఐదు నిమిషాల్లో మంచి చూపిస్తే సరిపోతుందా... ఇది ఎంతవరకూ న్యాయం అని నిలదీశారు.


స్మగ్లింగ్‌ చేసే పుష్పరాజ్‌ నోటిమాట తగ్గేదే లే అన్నది ఇప్పుడు అంతా వాడుతున్నారన్నారు. ఇలాంటి డైలాగ్‌ వల్ల నేరాలు పెరుగుతున్నాయన్నారు. కాస్త చాదస్తంగా అనిపిస్తున్నా.. ఆయన మాటల్లో నిజం లేకపోలేదు. కుర్ర హీరోలు కాస్త ఆలోచిస్తే మంచిదేమో..?


మరింత సమాచారం తెలుసుకోండి: