ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ ఐక్య రాజ్య సమితి సర్వప్రతినిధి సభ అత్యవసరంగా సమావేశం అవుతోంది. ఈ ఐక్య రాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో మొత్తం 199 సభ్య దేశాలు ఉన్నాయి. అంటే ఇంచు మించు ప్రపంచ దేశాలన్నీ ఇందులో ఉన్నట్టే లెక్క. అలాంటి సర్వ ప్రతినిధి సభలో ఎలాంటి చర్చ జరుగుతుంది.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఆసక్తి కరంగా మారింది.


ఈ 199 సభ్య దేశాలున్న సర్వప్రతినిధి సభ అత్యవసర ప్రత్యేక సమావేశానికి అమెరికాతో పాటు నాటోలోని కీలక దేశాలు రంగం సిద్ధం చేశాయి. అయితే మొన్న జరిగిన ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి భేటీలోనూ రష్యాపై చర్య కోసం అమెరికా తీర్మానం ప్రవేశ పెట్టింది. ఈ భద్రతామండలిలో మొత్తం 15 దేశాలు ఉంటాయి. ఇందులో అమెరికా ప్రవేశ పెట్టిన తీర్మానానికి అనుకూలంగా 11 దేశాలు ఓటు వేస్తే.. భారత్‌, చైనా, యూఏఈ మాత్రం ఓటింగ్‌ కు దూరంగా ఉండిపోయాయి. అయితే రష్యా తన వీటో అధికారంతో ఈ తీర్మానాన్ని వీటో చేసింది.


ఈ తీర్మానాన్ని రష్యా వీటో చేస్తుందని తెలిసినా అమెరికా ప్రవేశ పెట్టింది. రష్యాపై ప్రపంచ దేశాల వైఖరిని బయటపెట్టేందుకు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా ఈ తీర్మానం ప్రవేశ పెట్టింది. దీంతో రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా, ఇతర నాటో దేశాలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఐక్య రాజ్య సమితి తీర్మానాలతో పాటు అంతర్జాతీయంగా ఆంక్షలు విధించడం ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.


రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా, ఐరోపా సమాఖ్య రష్యాకు మరో షాక్ ఇచ్చాయి. స్విఫ్ట్‌ నుంచి రష్యాను తొలగించాయి.  ఇలా చేయడం వల్ల 200 కు పైగా రష్యా బ్యాంకుల లావాదేవీలకు ఇబ్బందులు వస్తాయి. వీటికి అనుసంధానంగా వ్యవహరిస్తున్న స్విఫ్ట్‌ నుంచి రష్యాను తొలగించడం ఆ దేశానికి ఇబ్బంది కలిగించేదే.. అయినా రష్యా ఇవేమీ లెక్క చేయడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: