వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశానిదేనని అప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబు ధీమాగా చెబుతున్నారు. అంతే కాదు.. ఆయన కాన్ఫిడెన్స్ ఏ లెవల్‌లో ఉందంటే.. తెలుగుదేశం నేతలు అప్రమత్తంగా ఉంటే పులివెందుల కూడా గెలుస్తామంటున్నారు. పులివెందులలో బాబాయిని చంపించానంటూ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఏ విధంగా ఓట్లడగగలడని ప్రశ్నిస్తున్న చంద్రబాబు..
బాబాయిని చంపించిన వ్యక్తికి పులివెందుల ప్రజలు ఓట్లేస్తారని తాను భావించడం లేదంటున్నారు.


ప్రతీ పాలసీకి సంస్కరణ పేరుతో లూటీ, విధ్వంసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి హిడెన్ అజెండాను ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపు ఇస్తున్నారు. భారత దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపించట్లేదు.. కానీ అలా ఉన్నందుకు మనకే సిగ్గేస్తోందని చంద్రబాబు అంటున్నారు.


పార్టీ నాయకుల్లో స్థైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. పార్టీలో ఏ కార్యకర్తను అక్రమంగా అరెస్టు చేసినా తన కుటుంబ సభ్యుడ్ని అరెస్టు చేసినట్లుగా భావించి స్పందిస్తున్నానంటున్నారు. కొందరు నేతల్లో కనీస పలకరింపు కరవవుతుండటం తగదంటున్న చంద్రబాబు.. 175నియోజకవర్గాల్లోనూ న్యాయ విభాగాన్ని పటిష్ఠం చేస్తామంటున్నారు.


తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రెచ్చిపోయేవారంతా.. జగన్మోహన్ రెడ్డికి కూడా దొరక్కుండా పారిపోతారని చంద్రబాబు అంటున్నారు. గత మూడేళ్లలో పోరాడి కేసుల్లో ఇరుక్కున్న వారికి పార్టీలో అన్ని రకాలుగా ప్రాధాన్యం ఇస్తామని.. అక్రమ కేసుల్లో జైలుకెళ్లిన వారు పార్టీ కోసం పోరాడిన యోథులుగా గుర్తిస్తామని చంద్రబాబు పార్టీ నేతలకు చెబుతున్నారు. ముందస్తు అరెస్టుల పట్ల కొందరు నేతల తీరు సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. కార్యక్రమానికి పిలుపునిచ్చి ఇంట్లోనుంచి బయటకు రాకుండా అరెస్టయ్యామంటే తగదని హెచ్చరించారు.


ఓ కానిస్టేబుల్ ఇంటికొచ్చినా హౌస్ అరెస్టయ్యాం ఇక మనకి పనిలేదనుకునే కొందరు నేతల తీరు సరికాదని చంద్రబాబు చురకలు వేశారు. గృహనిర్బంధానికి పోలీసులు ఇంటికొస్తే బీదఅరుపులు కాదు, గట్టిగా నిలదీయండని పిలుపు ఇస్తున్నారు. కొందరు పోస్టింగ్ ల కోసం కక్కుర్తిపడి ఇష్టానుసారం ప్రవర్తిస్తే న్యాయస్థానంలో వారిని దోషులుగా నిలపెడదామని క్యాడర్‌కు చంద్రబాబు పిలుపు ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: