
రాష్ట్రంలోని ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ ఏపీ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక, ట్యాబ్ ల పంపిణీ, సీబీఎస్ఈ ఆంగ్ల మాధ్యమం తదితర అంశాల పర్యవేక్షణ రీత్యా టీచర్లను బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చట్ట సవరణ చేస్తూ జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. బోధనేతర విధుల నుంచి టీచర్లను తప్పించే నిబంధనల సవరణకు సంబంధించిన అంశంపై రాష్ట్రప్రభుత్వం కేబినెట్ ఆమోదాన్ని కూడా తీసుకుంది.
ఈమేరకు వర్చువల్ క్యాబినెట్ ద్వారా మంత్రులకు నోటిఫికేషన్ పంపి డిజిటల్ సంతకాలతో ఈ సవరణ చేసింది. నిర్బంధ విద్యాహక్కు చట్టం 2009 కూడా టీచర్లను బోధనేతర విధులకు వినియోగించడంపై నిషేధం విధించాలని సూచిస్తోందని జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కోంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. సవరించిన నిబంధనల్లో భాగంగా టీచర్లను విద్యాబోధనకు సంబంధించిన అంశాలపై మాత్రమే దృష్టిసారించాలని జగన్ ప్రభుత్వం చెబుతోంది.
పాఠశాలల్లో బోధనేతర విధులను మినహా ఇతర విధులు అప్పగించకూడదని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇతర ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో లేనప్పుడు టీచర్ల సేవలను వినియోగించుకుంటామని జగన్ ప్రభుత్వం నిబంధనల సవరణ నోటిఫికేషన్ లో తెలిపింది. సర్కారు నిర్ణయాన్ని టీచర్లు స్వాగతిస్తున్నారు.