సింగరేణి బొగ్గు గనుల వేలం ప్రకటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించమంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల్లబొల్లి మాటలు చెప్పారని.. కానీ.. నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నట్లు లోక్ సభలో కేంద్రం ప్రకటించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరించడం అంటే తెలంగాణ రాష్ట్రాన్ని కుప్పకూల్చడమేనన్న మంత్రి కేటీఆర్.. తెలంగాణ అభివృద్ధిపై అసూయతో, ఇక్కడి విజయ ప్రస్థానాన్ని దెబ్బ కొట్టాలన్న కుట్రతోనే సింగరేణిని కేంద్రం ప్రైవేటీకరిస్తోందన్నారు.


వైజాగ్ స్టీల్ ప్లాంటు తరహాలో గనులు కేటాయించకుండా సింగరేణిపై కేంద్రం కుట్ర చేస్తోందని.. ఉత్పత్తిలో, లాభాల్లో, పీఎల్ఎఫ్ లోనూ రికార్డు సృష్టిస్తున్న సింగరేణిని ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏముందని..మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం పట్టించుకోలేదన్న మంత్రి కేటీఆర్.. ప్రధాని తన సొంత రాష్ట్రం గుజరాత్ కి మాత్రం గనులు కేటాయించుకున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రం గుజరాత్ కి ఒక నీతి... తెలంగాణకి మరొక నీతిని అమలుచేస్తున్నారా? ప్రధానమంత్రి స్పష్టం చేయాలని
 నిలదీశారు.


తెలంగాణ పట్ల పక్షపాతం ఇంకెన్ని రోజులని ప్రశ్నించిన మంత్రి కేటీఆర్.. ఇది ఒక్క సింగరేణి కార్మికుల సమస్య కాదు సమస్త తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే ప్రజా ఉద్యమం తప్పదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై పార్టీలకు అతీతంగా రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో గళమెత్తాలని మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు.


అయితే.. మంత్రి కేటీఆర్ వాదనతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు విబేధిస్తున్నారు. కేంద్రం నిబంధనల ప్రకారమే వెళ్తోందని వారు చెబుతున్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనే కేంద్రానికి లేదని అంటున్నారు. అసలు సింగరేణిలో మెజారిటీ వాటా రాష్ట్రానిదే అయినప్పుడు కేంద్రం ఎలా ప్రైవేటు పరం చేస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: