తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అది ఇప్పటికీ సాధ్యం కాలేదు. రూటు మార్చిన కేసీఆర్ రాష్ట్రంలో సరి కొత్త పథకాన్నితీసుకువస్తున్నామని ప్రకటించారు. అదే గృహలక్ష్మీ పథకం. ఇళ్లు  కట్టుకోవాలనుకుంటున్న వారికి ప్రభుత్వం  రూ. 3లక్షలు ఇస్తుంది. అది వారి సొంత జాగలో కట్టుకోవాలి. గతంలో పది లక్షలు, తర్వాత అయిదు లక్షలు ఇస్తామన్నమాటలు అటకెక్కాయి.


ఇలా ప్రభుత్వం రోజుకో మాట మార్చుతూ పేదల  ఇళ్ల కలను దూరం చేసేస్తోంది.  సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లలో  మాత్రం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించారు. వాటిని లబ్ధిదారులకు అందజేశారు. కానీ రాష్ట్రమంతా అనే సరికి పథకాన్నే మార్చేశారు. ఇలా చేయడం వల్ల ప్రజల్లో నిరాశ కలుగుతుంది. ప్రస్తుతం ఈ పథకంలో ఇళ్లు కట్టుకోవాలనుకున్న వారికి రూ. 3 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. అది కూడా మూడు సార్లు అందజేస్తుంది.


ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇళ్లు కడతామని ప్రకటించారు. ఇందులో 119 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 3000 వేల ఇళ్లు ఇస్తామన్నారు. ఇచ్చే మూడు లక్షల రూపాయలను మూడు విడతల్లో ఇస్తామని చెబుతున్నారు. నియోజకవర్గానికి మూడు వేల ఇళ్లు ప్రకటిస్తే అందులో పార్టీ కార్యకర్తలకే అవి సరిపోతాయి. పేదవారికి ఎలా చేరతాయి. మొత్తం 43వేల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మిగతావి మళ్లీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రజలు ఎంతలా ఊహించుకున్నారంటే గాల్లో మేడలు కట్టుకున్నారు. బంగ్లా ఇంటికి చేరుకుంటామని కలలు కన్నారు. ఇప్పుడవి కల్లలు గానే మిగిలిపోయేలా ఉన్నాయి.


మూడు లక్షల రూపాయలతో ఇళ్లు అవుతుందా.. పోనీ ఆ డబ్బులనైనా ఒకే సారి ఇస్తారా అంటే మూడు విడతల్లో అందజేస్తారట. సీఎం కేసీఆర్ ఆలోచన విధానం మారింది అనడానికి ఈ గృహలక్ష్మీ పథకం నిదర్శనంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: