ఆయనో పత్రికాధిపతి.. అందులోనూ జర్నలిస్టు కూడా.. అయితే.. ఆ కలానికి కాస్త పక్షపాతం ఎక్కువ అన్న పేరు కూడా ఉంది. అందులోనూ ఓ వర్గానికి చెందిన వాళ్లకు అన్యాయం జరిగితే ఆయన అస్సలు ఊరుకోరు.. విషయం ఏంటంటే.. ఇప్పుడు ఏపీ సర్కారు అమరరాజా బ్యాటరీస్ సంస్థపై కక్ష కట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ తనకు గిట్టని పార్టీ నాయకుడిది కావడం వల్ల ఆ సంస్థను వేధిస్తున్నారన్న వాదన ఉంది. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక ఆ సంస్థ ఏకంగా తమిళనాడుకు వెళ్దామని భావిస్తోందట.


ఈ అంశంపై స్పందించిన పత్రికాధిపతి ఆర్కే తన వ్యాసంలో జగన్ సర్కారు తీరును ఎండగట్టారు. ఓ సంస్థపై ఆరోపణలు వస్తే ఆ సంస్థ వివరణ ఇచ్చుకుంటుంది.. కానీ.. ఈ పత్రికాధిపతి మాత్రం విపరీతంగా బాధపడిపోయారు. ఆ సంస్థ గొప్పదనం గురించి.. ఆ సంస్థ గురించి ఎవరెవరు ఎంతగా ప్రశంసించారో రాస్తూ.. ఆ సంస్థ పీఆర్వోను మించిపోయేలా స్పందించారు. ఆ సంస్థ కాలుష్యాన్ని వెదజల్లుతోందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే ఆ కాలుష్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందా? కంపెనీ నుంచి వచ్చే సీసం వల్ల తమ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయని ఎవరైనా ఫిర్యాదు చేసారా.. చికిత్స కోసం ఒక్కరు కూడా ఆస్పత్రిలో చేరిందీ లేదని వకాల్తా పుచ్చుకున్నారు.


వివిధ రాష్ర్టాలకు చెందిన కాలుష్య నియంత్రణ అధికారులు సైతం ఆక్షేపించడానికి ఏమీ లేదని చెబుతున్నారట. ఈ సంస్థ గురించి బ్యాటరీల రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన జాన్సన్‌ కంట్రోల్స్‌ అనే సంస్థ... ఒకప్పుడు మేం సహకారం అందించాం, ఇప్పుడు అమరరాజా నుంచే మేం నైపుణ్యాన్ని స్వీకరించాల్సి ఉందని గొప్పగా చెప్పారట. అమరరాజా వెళ్లిపోతే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయాన్ని కోల్పోతుందని.. రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారుతుందని అంటున్నారు. ఒక సామాజికవర్గంపై ద్వేషంతో రాష్ర్టానికే ద్రోహం చేస్తున్న వారిని ఏమనాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ వ్యాసం చూస్తే.. సదరు పత్రికాధిపతి అమరరాజా పీఆర్వోగా మారిపోయారా అన్న అనుమానం కలిగేలా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: