వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాలాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అందుకు తగ్గ ప్లాన్‌ రెడీ చేసుకుంటోంది. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇటీవల ఆ పార్టీ ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు దాని అమలు దిశగా కార్యాచరణ మొదలు పెట్టింది. పార్టీ సీనియర్‌ నేతలు, అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన గ్రూప్‌ 23 నేతలతో కలిపి సోనియా కీలకమైన ప్లాన్ రెడీ చేశారు. ఈ ప్లాన్ అమలు కోసం సోనియా మూడు బృందాలను ఏర్పాటు చేశారు.


పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో రాజకీయ వ్యవహారాల కమిటిని ఏర్పాటు చేశారు. రాహుల్‌ గాంధీ టీమ్‌లో ఈ రాజకీయ వ్యవహరాల బృందంలో మల్లిఖార్జున ఖర్గే, సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, అంబికా సోని, దిగ్విజయ్‌సింగ్‌, ఆనంద్‌శర్మ, కె.సి వేణుగోపాల్‌, జితేంద్రసింగ్‌లు ఉంటారు. అలాగే మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం నేతృత్వంలో 2024 టాక్స్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశారు. 2024 టాస్క్‌ఫోర్స్‌ పేరుతో మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం నేతృత్వంలో నియమించిన కమిటీలో ముకుల్‌ వాస్నిక్‌, జైరాం రమేష్‌, కె.సి.వేణుగోపాల్‌, అజయ్‌ మాకన్‌, ప్రియాంకగాంధీ, రణదీప్‌ సుర్జేవాలా, సునిల్‌ కనుగోలు ఉంటారు.


మరో కీలకమైన భారత్‌ జోడో యాత్ర ప్రణాళిక, దాని సమన్వయం కోసం సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ నేతృత్వంలో మరో కమిటిని నియమించారు. దిగ్విజయ్‌ సింగ్‌ టీమ్‌లో అంటే.. భారత్‌ జోడో యాత్ర కేంద్ర ప్రణాళికా బృందంలో సచిన్‌ పైలెట్‌, శశిథరూర్‌, రవ్‌నీత్‌సింగ్‌ బిట్టూ, కె.జె.జార్జ్‌, జ్యోతిమణి, ప్రద్యుత్‌ బోడోలాయ్‌, జితు పత్వారి, సలీం అహ్మద్‌లను సభ్యులుగా ఉంటారు. ఈ టీమ్ సభ్యులకు భారత్‌ జోడో యాత్రకు సంబంధించిన పలు విభాగాల కార్యకలాపాలను అప్పగిస్తారు.


ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.  ఏఐసిసి కార్యాలయంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటి భేటీ కూడా జరిగింది. తదుపరి కార్యచరణపై చర్చ జరిగింది. అలాగే త్వరలో పార్టీ ప్రక్షాళన పై కూడా కీలక నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి సోనియా గట్టి కసరత్తే చేస్తున్నారు. మరి మోడీని కట్టడి చేస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి: