నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్‌ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆత్మకూరు ఉప ఎన్నిక మొత్తం ఫలితాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,13,338 మంది. వీరిలో ఈ నెల 23న జరిగిన పోలింగ్‌లో ఓటేసింది 1,37,081 మందే. అంటే 64 శాతం మంది ఓట్లు వేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సహా 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి మొత్తం 1,02,074 ఓట్లు వచ్చాయి.


ఇక ఫుల్ డిటైల్స్ చూస్తే.. బీజేపీ అభ్యర్థికి 19,332 ఓట్లు,  బీఎస్పీ అభ్యర్థికి 4,897 ఓట్లు వచ్చాయి. ఇక ఏ అభ్యర్థి నచ్చలేదని చెప్పే నోటాకు  4,197 ఓట్లు రావడం విశేషం. ఇక ఆత్మకూరు ఉపఎన్నికలో మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు  217 నమోదు అయ్యాయి. వీటిలో వైసీపీకి  167 ఓట్లు, బీజేపీకి  21 ఓట్లు,  బీఎస్పీకి  7, ఇతరులకు మరో 10 ఓట్లు వచ్చాయి. సరిగ్గా ఓటేయని  9 ఓట్లు తిరస్కరించగా నోటాకు పోస్టల్ బ్యాలెట్‌లో  3 ఓట్లు వచ్చాయి.


ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ విక్రమ్ రెడ్డే ఆధిపత్యంలో ఉన్నారు. ఏ దశలోనూ ఇతర అభ్యర్థులు ఆయన్ను దాటేయలేదు. మేకపాటి విక్రమ్‌ రెడ్డి తన ప్రత్యర్థులపై పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించారు. 15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి విక్రమ్ రెడ్డికి మొత్తం పోలైన ఓట్లలో సగానికి పైగా అంటే 76,096 ఓట్లు వచ్చేశాయి. అప్పుడే ఆయన విజయం ఖాయమైపోయింది.


విక్రమ్ రెడ్డి సోదరు మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఈ ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగి 92,758 ఓట్లు దక్కించుకున్నారు. ఆయన తన ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 22,276 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు విక్రమ్ రెడ్డి తన అన్న కంటే 9,316 ఓట్లు ఎక్కువగా సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: