ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తీసుకుంటున్నా.. అందులో మంచి నిర్ణ‌యాలు ఉన్నా కూడా అవే నిర్ణయాలు త‌మ్ముళ్లలో అనుకోని గుబులు రేపుతున్నాయి. ముఖ్యంగా పీ-4 కార్య‌క్ర‌మం విష‌యంలో నేత‌ల్లో కొంత ఆందోళ‌న నెల‌కొంది. ఈ పథకం కింద ధనవంతులు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని చంద్ర‌బాబు పిలుపునిస్తున్నారు. తాను స్వయంగా 250 కుటుంబాలను దత్తత తీసుకున్నానని పదే పదే చెబుతూ వ‌స్తున్నారు. ఈ నిర్ణయం మంచిదే అయినా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. నేరుగా చంద్ర‌బాబు వారిని ఏమీ అనకపోయినా, సోషల్ మీడియాలోనూ, ప్రధాన మీడియాలోనూ వస్తున్న విశ్లేషణలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. “నాయకులు ధనవంతులు కాబట్టి వారూ దత్తత తీసుకోవాలి” అనే ఒత్తిడి వారిపై పెరుగుతోంది. ప్రస్తుతానికి టీడీపీలో 70% మంది ఎమ్మెల్యేలు, 90% మంది ఎంపీలు బాగా సంపన్నులు. గుంటూరు ఎంపీ దేశంలోనే అత్యంత ధనవంతుడని రికార్డులే చెబుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వీరందరూ పీ-4లో భాగస్వామ్యం కావడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి.


నేతలు మాత్రం తమదైన వాదన చెబుతున్నారు. పేదరిక నిర్మూలన మంచిదే కానీ అది పూర్తిగా సాధ్యం కాదని వారి నిశ్చితాభిప్రాయం. అంతేకాదు, రాజకీయాల్లో ఉన్నవారు ఎవరినీ నేరుగా దత్తత తీసుకోవడం అంత సులభం కాదని భావిస్తున్నారు. ఏదేమైనా, వారిపై వస్తున్న కామెంట్లు, మీడియా వార్తలు వారిని అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. ఈ పరిణామం వల్ల అంతర్గతంగా చాలామంది “బాబోయ్.. ఈ సంకల్పం మంచిదే కానీ, అమలులో ఇబ్బందులు ఉన్నాయి” అంటూ చర్చలు మొదలుపెట్టారు. చంద్ర‌బాబు మాత్రం ఎవ‌రినీ బలవంతం చేయడం లేదనే స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో కొందరు ఎంపీలు తాజాగా ఒక ప్రతిపాదన చేశారు. తాము నేరుగా దత్తత ప్రక్రియలో పాల్గొనకపోయినా, కొంత మేరకు నిధులు అందించేందుకు సిద్ధమని చెప్పారు. పీ-4 కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి అందులో డబ్బులు ఇవ్వాలని సూచించారు.


ఈ ఆలోచన అమలు అయితే చంద్ర‌బాబు ఆశయం మరింత సాఫల్యం సాధించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు నేరుగా దత్తత తీసుకోవాల్సిన అవసరం లేకుండానే, నిధుల ద్వారా పేదల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. దీంతో నాయకులపై ఒత్తిడి తగ్గి, సమాజ సేవలోనూ పార్టీకి మంచి పేరొస్తుంది. మొత్తానికి, చంద్ర‌బాబు పీ-4 సంకల్పం సార్ధకమవ్వాలంటే ఆచరణలో సౌలభ్యం తీసుకురావడం అవసరం అని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: