భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) 2700 జూనియర్ ఇంజినీర్(జేఈ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. మూడేళ్ల డిప్లొమా లేదా బీఎస్సీ లేదా బీటెక్‌లో ఎంపికచేసిన కోర్సులు చదివిన విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష ద్వారా నియామకాలు చేపడతారు. మొత్తం 27 సర్కిళ్లలో కలుపుకుని 2700 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు నచ్చిన సర్కిల్‌ను ఎంచుకోవచ్చు.

అర్హత: టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, రేడియో, కంప్యూటర్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్పర్మేషన్ టెక్నాలజీ వీటిలో ఎందులోనైనా మూడేళ్ల డిప్లొమా లేదా బీటెక్/ బీఈ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్ లేదా ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో ఎందులోనైనా ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: ఆగస్టు 10, 2016 నాటికి కనీసం 18 ఏళ్లు నిండాలి. 30 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఆంధ్రప్రదేశ్ సర్కిల్(ఏపీ+తెలంగాణ)లో మొత్తం 76 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 38 ఓసీ, 21 ఓబీసీ, 12 ఎస్సీ, 5 ఎస్టీ, 2 దివ్యాంగులకు కేటాయించారు. అయితే అభ్యర్థులు మాత్రం నచ్చిన సర్కిల్‌ను ఎంచుకోవచ్చు. ఎందుకంటే జేఈ ఉద్యోగం సర్కిల్ పరిధిలోకి వస్తుంది. ఖాళీలన్నీ ఆయా సర్కిళ్ల ప్రకారం భర్తీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్నట్లు లోకల్, నాన్ లోకల్ అనే నిబంధనలు వర్తంచవు. అందువల్ల అభ్యర్థులు ఉద్యోగం చేయాలనుకుంటున్న సర్కిల్‌ను ఎంచుకోవచ్చు. లేదా ఎక్కువ ఖాళీలు ఉన్న సర్కిల్‌ను ఎంచుకోవచ్చు. ఫలానా సర్కిల్‌లో అయితే తక్కువ పోటీ ఉంటుందని భావిస్తే ఆ సర్కిల్‌కే ప్రాధాన్యం ఇచ్చుకోవచ్చు. ఒకసారి సర్కిల్‌ను ఎంచుకున్నతర్వాత మార్చుకోవడం దాదాపు సాధ్యపడదు.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జులై 10
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఆగస్టు 10
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: సెప్టెంబరు 25 ( ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు)
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్
పరీక్ష ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000; ఎస్సీ, ఎస్టీలకు రూ.500
పరీక్ష ఇలా...

ఆన్‌లైన్‌లోనే పరీక్షను నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి.. ప్రశ్నపత్రంలో 3 భాగాలు ఉంటాయి. అవి...పార్ట్- 1 జనరల్ ఎబిలిటీ టెస్ట్, పార్ట్- 2 బేసిక్ ఇంజినీరింగ్ పార్ట్ -3 స్పెషలైజేషన్. పార్ట్ -1కు 20, పార్ట్ -2కు 90, పార్ట్ -3కి 90 మార్కులు కేటాయించారు.

అర్హత సాధించాలంటే
జనరల్ అభ్యర్థులైతే ప్రతీ సెక్షన్‌లోనూ కనీసం 30 శాతం మార్కులు పొందడం తప్పనిసరి. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలైతే 20 శాతం మార్కులు రావాలి. దీంతోపాటు అన్ని సెక్షన్లూ కలుపుకుని ఓసీ అభ్యర్థులు 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 33 శాతం మార్కులు పొందాలి. అనంతరం మెరిట్ ప్రాతిపదికన పోస్టింగులు కేటాయిస్తారు.

ఈ విభాగాల నుంచి ప్రశ్నలు
బేసిక్ ఇంజినీరింగ్, స్పెషలైజేషన్ విభాగాల్లో వచ్చే ప్రశ్నలన్నీ మూడేళ్ల డిప్లొమా స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు డిప్లొమా పాఠ్యపుస్తకాలు చదవడానికి ప్రాధాన్యమివ్వాలి. జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో జనరల్ ఇంగ్లిష్, వర్తమానాంశాలు, జనరల్ నాలెడ్జ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలోని ప్రశ్నలన్నీ ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి. రోజువారీ పరిశీలన ద్వారా వీటికి సమాధానాలు గుర్తించడం తేలికే. పార్ట్ -2 బేసిక్ ఇంజినీరింగ్ విభాగంలో అప్లైడ్ మ్యాథ్స్, అప్లైడ్ ఫిజిక్స్, బేసిక్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ టెక్నిక్స్ పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలడుగుతారు. పార్ట్ -3 స్పెషలైజేషన్‌లో ఎలక్ట్రికల్, కమ్యూనికేషన్, నెట్‌వర్క్ ఫిల్టర్స్ అండ్ ట్రాన్స్‌మిషన్ లైన్స్, ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ మెజర్‌మెంట్స్, కంట్రోల్ సిస్టమ్స్, మైక్రోప్రాసెసర్స్, కంప్యూటర్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ఎంపికైతే..
ఎంపికైన అభ్యర్థులకు బీఎస్ఎన్ఎల్ శిక్షణ నిర్వహిస్తుంది. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి ఉద్యోగం ఖాయమవుతుంది. విధుల్లోకి చేరిన తర్వాత రూ.13600 మూలవేతనంగా చెల్లిస్తారు. దీనికి అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. కనీసం రెండేళ్లపాటు పనిచేయడం తప్పనిసరి. ఇందుకోసం ఒప్పందపత్రం రాయాలి.