జీవితం అన్నాక ఎత్తు పల్లాలు సహజం. అలాగే సమాజంలో ఉంటున్నాక.. అన్ని రకాల అనుభవాలు ఎదురవుతాయి. ప్రశంసలు, తిట్లు, మెచ్చుకోళ్లు, తెగడ్తలు అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే.. ప్రశంసల సంగతి ఎలా ఉన్నా.. ఎదుటి వ్యక్తితో మాటలు అనిపించుకోవడం ఎవరి మనస్సునైనా నొప్పించేదే.

 

 

బయటి వ్యక్తులు మనల్ని ఓ మాట అంటే పెద్దగా పట్టించుకోం.. కానీ.. మన మనస్సుకు దగ్గరగా ఉన్నవారు, ఆత్మీయులు, వారే మన సర్వస్వం అనుకున్నవారు.. మనపై కోపగిస్తే.. మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. వారు అన్నది చిన్నమాటే అయినా మనకు అంతులేని దుఃఖాన్ని ఇస్తుంది. మరి ఎందుకు ఈ తేడా..?

 

 

అది మనం వారిపై పెంచుకున్న నమ్మకం, ప్రేమే ఇందుకు కారణం. అయితే ఇక్కడే మరో కీలకమైన విషయం గమనించాలి. మన ఆత్మీయులు మనపై కోపగించుకుంటే.. ఆ కోపంలో కోపాన్ని మాత్రమే మనం అర్థం చేసుకుంటే.. ఆ బంధం బీటలు వారుతుంది. అది కలకాలం నిలబడే అవకాశాలను కోల్పోతుంది.

 

 

కానీ.. మన ఆత్మీయులే మనపై కోపగించుకున్నప్పుడు.. ఆ కోపం వెనుక ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటే.. ఆ బంధం ఇంకా ధృడమవుతుంది. పది కాలాలు పదిలంగా ఉంటుంది. మన ఆత్మీయులు మనపై కోప్పడ్డారంటే అది కచ్చితంగా మన మంచి కోసమే అయ్యుంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పోనీ.. అకారణంగా మనపై కోపగించినా.. పోనీలే మనవాళ్లే కదా.. చిరాకులో మనల్ని కాకపోతే ఎవరిని అంటారు అని కాస్త సంయమనం పాటించాలి. ఏమంటారు..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: