గత ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ 175 నియోజకవర్గాల్లో ఒకచోట డిపాజిట్ కోల్పోయి, పరువు పోగొట్టుకుంది. 174 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వైసీపీకి కొంతవరకు పోటీ ఇచ్చారు. కానీ అరకు అసెంబ్లీ స్థానంలో టీడీపీ డిపాజిట్ కోల్పోయింది.

జగన్ ఇమేజ్ వల్ల వైసీపీ నుంచి పోటీ చేసిన చెట్టి ఫాల్గుణ భారీ మెజారిటీతో గెలిచారు. ఇక రెండో స్థానంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన దొన్ను దొర నిలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ కేవలం 20 వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయారు. అయితే జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఫాల్గుణ, తనకు సాధ్యమైన మేర నియోజకవర్గంలో పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఎలాగో ఎలాంటి లోటు లేకుండా అందుతున్నాయి. ఇంకా కొత్తగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసాకేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి.

అరకు పర్యాటక ప్రాంతం కావడం బాగా కలిసొచ్చే అంశం. ప్రభుత్వం కూడా అరకుని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ కనీస వసతులైన రహదారులు, మంచినీరు, వైద్యం లాంటివి ఇక్కడ ప్రజలకు సరిగా అందడం లేదు. గర్భిణీ స్త్రీలు సదుపాయాలు లేక తమ గుడిసెలలోనే ప్రసవించడం వల్ల ఈ ప్రాంతంలో మాతాశిశు మరణాలు కూడా ఎక్కువే. అలాగే స్థానికంగా ఉండే హార్టికల్చర్, లక్కబొమ్మల తయారీ పరిశ్రమలను ప్రోత్సహించి, వాటి అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాల్సిన అవసరముంది.

రాజకీయంగా చూసుకుంటే ఇక్కడ జగన్ ఇమేజ్ బాగా ఉంది. అదే ఎమ్మెల్యేకు ప్లస్. కానీ టీడీపీ నుంచి ఓడిన శ్రవణ్ పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. కొన్నిరోజులు పార్టీ తరుపున కార్యక్రమాలు చేసిన శ్రవణ్, గత రెండు, మూడు నెలల నుంచి పార్టీలో కనిపించడం లేదు. దీంతో ఆయన జంప్ కొట్టడం ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇలా శ్రవణ్ యాక్టివ్‌గా లేకపోవడం టీడీపీకి బాగా మైనస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: