కొత్త వాళ్లంతా చెడిపోతున్నారు
పాత వాళ్లంతా న‌దుల చెంత
చితా భ‌స్మంలో క‌లిసి ఉన్నారు
ఆ బూడిదను
త‌న‌లో ల‌యం చేసుకునే
సుకృతి ఈ నేల చేసుకుంది
ఇంకా మ‌న‌మే చేసుకోలేదు
న‌మామి వేటూరి స్మ‌రామి వేటూరి


పాట రాసిన ప్ర‌తిసారి  ఆనంద భైర‌విని మోగించాడు. పాట రాసిన ప్ర‌తిసారీ వేణువుకు వెదురుకు ఉన్న తేడాలు వ‌ర్ణించాడు. తెలుగు వారంతా కృష్ణమ్మ ఒడికి పోయేలా చేశాడు.సీతారామ‌య్య గారి మ‌న‌వ‌రాలు తో న‌డిచాడు.అర‌విచ్చేటి అభేరి రాగాల‌కు స్వ‌రం ఇచ్చి ఇరు తీరాల గోదారి గంగ‌మ్మ‌ల‌ను మ‌న‌కు ప‌రిచ‌యం చేయ‌గ‌ల స‌మ‌ర్థుడు. తెలుగు త‌మిళం రెండు సంస్కృతుల‌నూ వర్ణించ‌గల స‌మ‌ర్థుడు. మ‌నిషి మాట మ‌న‌సు మూడు కూడా వేర్వేరు కాదు ఒక్క‌టే ఆ త్రిక ల‌బ్ధం విలువ ఓ సాహిత్య కుసుమ పరిమ‌ళం మాత్రమే చెప్పి పోతుంది. వేటూరిని ఇవాళ విజ‌య‌వాడ‌లో స్మ‌రిస్తారా ఏమో! వాళ్లింట్లో కూడా ఆ ప‌ట్టింపు పెద్ద‌గా లేద‌నే అనుకుంటాను. కానివ్వండి కానివ్వండి విజ‌య‌వాడ ఒడ్డున వేటూరి విగ్ర‌హం ఉందా స‌ర్ తెలియ‌దు కానీ ఎన్టీఆర్ విగ్ర‌హం మాత్రం ఉంటుంది ఉండాలి కూడా!


వెతికి వెతికి వేటూరి ఇంటికి పోయాను.గుంటూరు పోయాను ఒంగోలు పోయాను అన్న విధంగా వేటూరి ఇల్లు పంజాగుట్ట మెట్రోస్టేష‌న్ కు ద‌గ్గ‌ర..వేద‌న నుంచి వేదం వ‌ర‌కూ అన్నీ ప‌లికించ‌గ‌ల స‌మ‌ర్థుడు అయిన ర‌చ‌యిత మ‌రియు క‌వి వేటూరి త‌ప్ప ఇంకొక‌రు లేరు అని చెప్ప‌డం అతిశ‌యం అయితే కాదు.పాట‌కు వేగం పాట‌కు ప్రామాణికత అన్న‌వి  స్ప‌ష్టం చేసిన క‌వి క‌నుక న‌మాజు వేళల్లో ఓన‌మాలు చ‌దివించ‌గ‌ల స‌మ‌ర్థుడు. కోయిల పాట‌లకు తీపి రాగాలు కొన్నే ఉంటాయా? ఏమో కానీ ఉన్నదంతా తీపి కాదు ఉన్న‌వ‌న్నీ చేదు కూడా కాదు.మ‌న‌సుకు మ‌న‌సుకు మ‌ధ్య ఆకాశం ఉంది అనిఅనుకోవాలి. మ‌నిషికో స్వ‌ర్గం నిర్మాణం సాధ్యం కాదు క‌నుక పాట‌ల స్వ‌ర్గంలో కొన్ని సార్లు కునుకు తీయాలి..క‌ల‌లు కొన్ని ఉంటే వాటికి రూపంవెతికి ఆ రూపంలో ఒదిగిపోవాలి.వెల్ల‌డిలో ఉన్న ఊహ‌ల‌కు పాట‌ల ను కొన్ని క‌లిపి ప‌ల‌కాలి. చక్క‌ని తండ్రికి ఛాంగుభ‌ళా!


పాటలు రాసే సుంద‌ర రాముడి పేరు కృష్ణా జిల్లాకు ఎందుకు పెట్ట‌కూడ‌దు అన్న ఆలోచ‌న నుంచి రాస్తున్నాను ఈ స్మ‌ర‌ణ. పాట‌లు రాసిన సుంద‌ర‌రాముడి తెలుగు సాహిత్యాన్ని ప‌రిఢ‌విల్లింప‌జేసిన కృష్ణా తీరంలో న‌డ‌యాడ‌డం మ‌నంద‌రి అదృష్టం అయి ఉంటుంది.తెలుగు పాట‌కు మంచి ఖ్యాతి తెచ్చిపెట్టాడు.కావ్య గౌర‌వం ఇచ్చాడు ఆ విధంగా సుంద‌ర రాముడిది మంచి పేరు.. మంచి హ‌స్త‌వాసి కూడా! ఆయ‌న పాట రాసిన ప్ర‌తిసారి కొన్నింట కావ్యాలు ప‌లికేయి..కొన్నింట వేద‌న‌లు ఒలికాయి..రాయి, ర‌త్నం రెండూ ఒక్క‌టేనా చెప్పండి.. ఆ న‌ల్ల‌ని రాళ్ళ‌పై అక్ష‌రాలు సుంద‌ర రాముడి పేరును త‌లుస్తాయి.. ఆ న‌ల్ల‌ని నీళ్ల‌పై న‌డ‌క‌లు సుంద‌ర రాముడు ఎక్క‌డ‌ని ప‌ల‌వ‌రిస్తాయి..ఆ దారెంట పోతుంటే ప‌ల‌క‌రిస్తాయి.వేటూరికి న‌మ‌స్సు.ఆమ‌ని పాడే వేళ ఆయ‌న‌ను స్మరిస్తే..కొమ్మ‌లు తాకిన ఆమ‌నికే కోయిల పుట్టునులే అని రాయ‌డంలో ఔన్న‌త్యం ఉంది.అర్థం ఆకాశం అంత‌!కనుక తెలిసిన ఆకాశం వేటూరి..తెలియ‌ని అగాధం కూడా ఆయ‌నే కావొచ్చు..వేటూరికి వంద‌నం.నివాళి..నివాళించి నివేదించి చెప్పే మాట త‌రువాత ...మౌనం ఓ వ‌ర్ఛ‌స్సు. క‌వితా వ‌ర్ఛ‌స్సు. నేడు అన‌గా జ‌న‌వ‌రి 29 జ‌యంతి...



- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

పోస్ట‌ర్ ఫ్రేమ్ : గిరిధ‌ర్ అర‌స‌వ‌ల్లి





మరింత సమాచారం తెలుసుకోండి: