సృష్టిని ఆరంభించడానికి వేదకాలం కంటే ముందే బ్రహ్మ చైత్ర శుద్ధ పాడ్యమి ని ముహూర్తంగా నిర్ణయించుకున్నాడు అంటారు. అప్పటి నుండే యుగారంభం అయిందని అంటారు. అది కాలక్రమేణా మారి ఇప్పుడు ఉగాది గా మారింది. మనిషి జీవితంలోని కాలం మన ప్రమేయం లేకుండానే గడిచిపోతూ ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో కాలం ఒక నిర్ధిష్టమైన శక్తి అంతర్లీనంగా ఉంటుంది. ఆ శక్తిని గ్రహించి కాలం విలువ తెలుసుకున్న వ్యక్తి మాత్రమే జీవితంలో విజయాన్ని పొందుతాడు.


భూమి చుట్టూ చంద్రుడు ఒకసారి తిరిగితే అది నెల అదేవిధంగా సూర్యుడు చుట్టూ భూమి ఒకసారి తిరిగితే అది సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు ఎన్నో మనిషి జీవితంలో వస్తూ ఉంటాయి. మన ఆలోచనల పై సూర్య చంద్రుల ప్రభావం చాల ఎక్కువగా ఉంటుంది అందువల్లనే జ్యోతిష్య శాస్త్రంలో సూర్య చంద్రుల స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. మన భారతీయ క్యాలెండర్ ప్రకారం గతంలో ‘శార్వరి’ నామ సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం వచ్చింది. శార్వరి అంటే చీకటి అందువల్లనే కరోనా మన దేశంలోకి వచ్చి ప్రజలను అతలాకుతలం చేసింది.


ఆతరువాత వచ్చిన ‘ప్లవ’ నామ సంవత్సరం నిన్నటితో ముగిసింది. ప్లవ అంటే తెప్ప అందువల్లనే గడిచిన సంవత్సరం చివరిలో చాల వరకు కరోనా నుండి ఉపశమనం పొందగలిగాము. నేటితో మన అందరి జీవితాలలోకి అడుగుపెట్టిన ‘శుభకృత్’ అంటే శుభాలను కలిగించేది. ప్రపంచాన్ని సంరక్షించే శక్తిగా ఈ శుభకృత్ అందరికీ సంపదలు శుభాలను కలిగిస్తుందని పంచాంగ కర్తలు చెపుతున్నారు.


ఈరోజు నుంచి మంచి ఆలోచనలతో ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తే అందరికీ బాగుంటుందని పంచాంగ కర్తలు చెపుతున్నారు. ఈ ‘ఉగాది’ నుంచి దేవి సంబంధించిన వసంత నవరాత్రులు శ్రీరామనవమి వేడుకలు ప్రారంభం అవుతాయి. వసంతానికి స్వాగతం పలుకుతూ కోకిల చేసే రాగాలు ఉగాది పచ్చడి లేకుండా ఉగాది పండుగ పూర్తికాదు. ప్రస్తుతం మన అందరి జీవితాలను ప్రభావితం చేసే మహత్తర శక్తి ‘డబ్బు’ మాత్రమే అని భావిస్తూ ఉంటారు. అయితే కాలాన్ని దైవ స్వరూపంగా చూస్తూ కాలం విలువ తెలుసుకున్న వ్యక్తి మాత్రమే విజయాన్ని సాధించగలడు. ఈ ఉగాది అందరి సత్సంకల్పానికి నాంది కావాలని ఆకాంక్షిస్తూ ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర శుభాకాంక్షలు..


మరింత సమాచారం తెలుసుకోండి: