ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. టికెటింగ్ వ్యవస్థను ఆన్ లైన్ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడం, థియేటర్ల నిర్వాహకులంతా కచ్చితంగా ఒప్పందం కుదుర్చుకోవాలని తేల్చి చెప్పడంతో మళ్లీ గొడవ మొదలైంది. అయితే దీనిపై థియేటర్ల నిర్వాహకులు హైకోర్టుని ఆశ్రయించారు. ఏపీ లో ఆన్‌ లైన్‌ సినిమా టికెట్ల విధానంపై వారు స్టే కోరారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన కోర్టు.. జులై 1వ తేదీన తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. సినిమా టికెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం తెచ్చిన సవరణ నిబంధనలను, ఆ తర్వాత వచ్చిన జీవోలను కొట్టేయాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై జులై 27న తుది విచారణ జరిపేందుకు నిర్ణయించింది హైకోర్టు.

రాష్ట్రంలో థియేటర్లన్నిటిలో ఇకపై ఆన్‌ లైన్‌ టికెటింగ్ వ్యవస్థను తెచ్చేందుకు ఏపీ ఫిలిం డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌ కు ఆ వ్యవహారాన్ని అనుసంధానిస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమేరకు నిబంధనలు సవరించిది. అయితే దీని వల్ల ఇప్పటికే ఆన్ లైన్ లో టికెట్లు అమ్ముతున్న బుక్ మై షో వంటి వారికి ఇబ్బంది కలుగుతుంది. వాటితో ఒప్పందాలు చేసుకున్న థియేటర్ యాజమాన్యాలు కూడా వాటిని రద్దు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటివేవీ జరగవని, ఆ ఒప్పందాలు కొనసాగించ వచ్చని చెబుతోంది. అయితే ఇక్కడే చిన్న మతలబు ఉంది. ఆల్రడీ ప్రభుత్వ వెబ్ సైట్ లో తక్కువ రేటుకి టికెట్ దొరుకుతుంటే, ఇక సర్వీస్ చార్జ్ కూడా తగలేసి, బుక్ మై షో వంటి ప్రైవేట్ వెబ్ సైట్స్ లో ప్రేక్షకుడు టికెట్ ఎందుకు కొంటాడు. దానివల్ల వచ్చే లాభమేంటి..? ఈ కారణాల వల్లే బుక్‌ మై షో, మల్టీప్లెక్స్‌ థియేటర్ల అసోసియేషన్, విజయవాడ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ న్యాయపోరాటం మొదలు పెట్టాయి. హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి.

ప్రభుత్వం 2 శాతం సర్వీస్‌ చార్జి వసూలు చేయడం తమకు అభ్యంతరకమని బుక్ మై షో తరపు న్యాయవాది వెల్లడించారు. ఆ సర్వీస్ చార్జికి తమ కన్వీనియన్స్ చార్జీలు కలిపితే టికెట్ రేటు పెరుగుతుందని, దాంతో కస్టమర్లు తమ ద్వారా టికెట్లు కొనడానికి ఇష్టపడరని చెప్పారు. తమ వ్యాపారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉత్తర్వులివ్వాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయస్థానం ఈ జీవో అమలుని కొన్నిరోజులు వాయిదా వేసే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి చెప్పింది. కానీ జీవో అంతా పక్కాగా ఉందని ఆ అవసరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు చెప్పారు. ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసేలా లేదు. జులై1న హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులిస్తుందోనన్న ఉత్కంఠ అందరిలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: